ఎంతటి మెగా వేలమైనా.. ఈ ఐదుగురినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదల్లేదు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మెగా వేలానికి ముహూర్తం దగ్గరపడుతోంది.

Update: 2024-10-04 20:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మెగా వేలానికి ముహూర్తం దగ్గరపడుతోంది. గత ఏడాది మినీ వేలం నిర్వహించగా.. ఈసారి మెగా వేలం చేపట్టారు. దీంతో చాలామంది మంచి ఆటగాళ్లు వేలానికి వచ్చే అవకాశం ఉంది. కాగా, వచ్చే సీజన్ కు సంబంధించి మెగా వేలం షెడ్యూల్ ప్రకారం డిసెంబరులో జరుగుతుందని భావించారు. కానీ, దీనికి ఒక నెల ముందే నవంబరులోనే జరిగే వీలున్నట్లు స్పష్టమైంది. ఈ మేరకు గత వారమే బీసీసీఐ నుంచి ఐపీఎల్ పాలసీలకు సంబంధించి నిబంధనలు విడుదలయ్యాయి. ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలి? ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంటుందా? ఉండదా? అనేది సందిగ్ధం వీడిపోయింది.

18వ సీజన్ మరింత ప్రత్యేకం..

రాబోయే 18వ సీజన్ ఐపీఎల్ లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది. కారణం.. పలు భారీ మార్పులే. భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు ఇవ్వడం, వేలానికి వచ్చి గాయాలతో దూరంగా ఉండే ఆటగాళ్లపై నిషేధం.. ఇలా చాలా అంశాలున్నాయి. కాగా, ఇప్పటివరకు జరిగినదానిని పరిశీలిస్తే.. ఓ ఐదుగురు ఆటగాళ్లను మాత్రం ఫ్రాంచైజీలు అసలు వదులుకోలేదు.

వారెవరనేది చూస్తే..

ఐపీఎల్ లో ఇప్పటివరకు ఫ్రాంచైజీలు అసలు వదులుకోని ఆటగాళ్లలో ముందువరుసలో ఉండేది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత దిగ్గజ ఆటగాళ్ల మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, యువ విధ్వంసక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్. వీరిలో సచిన్ మినహా మిగతా నలుగురూ వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ తమతమ జట్లకు ఆడనున్నారు. కాగా, సచిన్ ను ముంబై ఇండియన్స్ తమ బ్రాండ్ గా భావిస్తుంటుంది. అతడు ఆడినంత కాలం అట్టిపెట్టుకుంది. తర్వాత మెంటార్ గా సేవలు పొందుతోంది. మరోవైపు ధోనీ మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కే ఉన్నాడు. మధ్యలో ఆ ఫ్రాంచైజీపై వేటు పడడంతో పుణె సూపర్ జెయింట్స్ కు ఆడాడు. విరాట్ కోహ్లి గురించి చెప్పేది ఏముంది..? రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్క టైటిల్ కూడా కొట్టకున్నా కోహ్లి ఫాలోయింగ్ తోనే ఆ జట్టుకు క్రేజ్ ఏర్పడింది. పంత్.. మొదటి నుంచి ఢిల్లీకే ఆడుతున్నాడు. కారు ప్రమాద గాయం అనంతరం అతడు 2024 సీజన్ లో ఐపీఎల్ ఆడాడు. మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. కాగా.. నరైన్ కోల్ కతా నైట్ రైడర్స్ తురుపు ముక్క అనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్ కతా కు బ్యాటింగ్ బౌలింగ్ లో నరైన్ తనదైన సేవలు అందించాడు.

రిటైన్ ఖాయం..

వచ్చే మెగా వేలంలోనూ ఈ నలుగురు ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవడం ఖాయం. మారిన నిబంధనల ప్రకారం ధోనీని చెన్నై అన్ క్యాప్ డ్ కేటగిరీలో తీసుకునే చాన్సుందని భావిస్తున్నారు. కోహ్లి ఎలాగూ ఆడినంత కాలం బెంగళూరుకే అనే ధోరణిలో ఉంటాడు. పంత్ ఢిల్లీకి కెప్టెన్. నరైన్ వయసు పైబడుతున్నా తనదైన శైలిలో బ్యాటింగ్ లో ప్రభావం చూపుతున్నాడు. ఓపెనర్ గా పంపుతున్న అతడిని వదిలే ఉద్దేశం కోల్ కతాకు ఉండదు.

Tags:    

Similar News