టీమ్ ఇండియా హెడ్ కోచ్.. చీఫ్ సెలక్టర్.. ఎవరి దారి వారిదే

చాంపియన్స్ ట్రోఫీ ముంగిట మళ్లీ ఇప్పడు మరో కథనం వినిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఇప్పటికే టీమ్ ఇండియా దుబాయ్ చేరింది. ఈ నెల 20న తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఆడనుంది.

Update: 2025-02-16 20:30 GMT

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఏ క్షణాన బాధ్యతలు చేపట్టాడో కానీ.. ఒకటే కథనాలు. శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ఓటమి.. న్యూజిలాండ్ పై తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి.. ఆపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో పరాజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)నకు దూరం.. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిల వైఫల్యం.. ఒకటేమిటి? అన్నీ సంచలనాలే.

చాంపియన్స్ ట్రోఫీ ముంగిట మళ్లీ ఇప్పడు మరో కథనం వినిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఇప్పటికే టీమ్ ఇండియా దుబాయ్ చేరింది. ఈ నెల 20న తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఆడనుంది. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. అయితే, జట్టును ఎన్నాళ్లుగానో వేధిస్తున్న సమస్య మిడిల్ ఆర్డర్‌. ఇటీవలి ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో మిడిల్ ఆర్డర్ లో అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణించాడు. కానీ,అయ్యర్ విషయమైన బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్, గంభీర్‌ మధ్య తీవ్ర చర్చ జరిగిందట. కుడి-ఎడమ కాంబినేషన్‌ అనేది గంభీర్ ఆలోచన. అంటే.. కుడి చేతి వాటం బ్యాటర్ ఔటైతే కుడిచేతివాటం బ్యాటర్.. ఎడమ చేతివాటం బ్యాటర్ ఔటైతే ఎడమచేతివాటం బ్యాటర్ అన్నమాట. అంతేకాక బ్యాటింగ్‌ లైనప్‌ లో ఫిక్స్‌ డ్‌ స్థానాలు ఉండవని, పరిస్థితికి తగ్గట్టు మార్చకుంటూ ఆడాలనేది గంభీర్‌ ఉద్దేశం.

ఇంగ్లాండ్‌ తో తొలి వన్డేలో గాయంతో తప్పుకొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బదులు అవకాశం దక్కిన అయ్యర్ అద్భుతంగా ఆడడంతో ఇప్పుడు అతడిని కాదనలేని పరిస్థితి. మిడిల్ ఆర్డర్‌ లో అతడి స్థానం సుస్థిరమైంది. అయితే, అతడికి తోడుగా ఎడమ చేతి స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ ను ప్రమోట్ చేస్తోంది. అక్షర్‌ ను నంబర్ 5లో, కేఎల్ రాహుల్‌ ను ఆరో స్థానంలో ఆడిస్తున్నారు. ఇది జట్టుకు మేలు చేసినా, రాహుల్ ప్రదర్శన పడిపోయింది. చివరి వన్డేలో మళ్లీ రాహుల్‌ ను నంబర్ 5లోనే ఆడించారు. చాంపియన్స్ ట్రోఫీలో అక్షర్‌ నే నంబర్ 5గా పంపుతారని తెలుస్తోంది.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్‌ పంత్‌ తొలి ప్రాధాన్య వికెట్‌ కీపర్‌. అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ కూడా ఈ స్థానానికి పంత్‌ పేరునే ప్రస్తావించింది. గంభీర్ మాత్రం ఇంగ్లండ్‌ తో వన్డే సిరీస్ లో రాహుల్‌కే కీపింగ్‌ అప్పగించాడు. దీనిపై గంభీర్‌, అగార్కర్ మధ్య తీవ్ర చర్చ జరిగిందట.రాహుల్‌ నంబర్‌ వన్‌ వికెట్ కీపర్‌ అని.. ఒకే మ్యాచ్‌ లో ఇద్దరు కీపర్లతో బరిలోకి దిగడం కష్టమేనని గంభీర్ అంటున్నాడు. అంటే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉద్దేశం ఎలా ఉన్నా గంభీర్ మాత్ర స్పెషలిస్ట్ కీపర్ గా రాహుల్ కే మద్దతు పలుకున్నట్లు స్పష్టం అవుతోంది.

Tags:    

Similar News