బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్.. ప్రపంచ క్రికెట్ లో మెరుపు వీరుడు
టెస్టులు, వన్డేలు, టి20లు.. మూడు ఫార్మాట్లలోనూ ఆడగల సత్తా.. క్లిష్ట పరిస్థితుల్లోనూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం..
టెస్టులు, వన్డేలు, టి20లు.. మూడు ఫార్మాట్లలోనూ ఆడగల సత్తా.. క్లిష్ట పరిస్థితుల్లోనూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం.. అవసరమైతే ధనాధన్ ఇన్నింగ్స్ తో స్కోరు పెంచే దమ్ము.. ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తూ.. స్పిన్ బౌలింగ్ తో కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే తెలివి.. అంతేకాదు.. అత్యంత ముఖ్యమైన పాయింట్ ప్రదేశంలో మెరుపు ఫీల్డింగ్ తో క్యాచ్ లు పడుతూ, పరుగులు అడ్డుకుంటూ ప్రపంచ క్రికెట్ లో అతడు ఇప్పుడు మెరుపు వీరుడిగా నిలుస్తున్నాడు.
బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్.. ఇలా మూడు అంశాల్లోనూ దుమ్మురేపే క్రికెటర్లు కొద్ది మందే ఉంటారు. చాలామంది ఏ రెండింటిలోనూ పర్ఫెక్ట్ గా ఉంటారు. ఫీల్డింగ్ లో కాస్త మెరుగ్గా కనిపిస్తారు. కానీ, న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిఫ్స్ మాత్రం బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.
ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో మెరుపు వీరుడు అంటే గ్లెన్ ఫిలిప్సే అని చెప్పాలి. 28 ఏళ్ల ఫిలిప్స్ ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 39 బంతుల్లోనే 61 పరుగులు బాదేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. బౌలింగ్ లోనూ 9 ఓవర్లు వేశాడు.
చాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ తో జరిగిన వన్డేలో ఫిలిప్స్ 74 బంతుల్లోనే 106 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇదికాక 28, 20, 61, 21 ఇవీ ఇటీవలి అతడి స్కోర్లు. అంతేకాదు ప్రతి మ్యాచ్ లోనూ కనీస ఓవర్లు బౌలింగ్ చేస్తుంటాడు. వీలు కుదిరితే పూర్తి కోటా వేసేస్తాడు. వికెట్లు కూడా తీస్తుంటాడు.
ఇక ఫిలిప్స్ ఫీల్డింగ్ విన్యాసాల గురించి చెప్పే కంటే యూట్యూబ్ లోనూ, సోషల్ మీడియాలోనూ చూడడమే ఉత్తమం. పక్షిలా అమాంతం గాల్లోకి ఎగురుతూ అతడు పట్టే క్యాచ్ లు.. డైవ్ లతో బంతులను, బౌండరీ లైన్ దగ్గర విన్యాసాలు ఇవన్నీ కళ్లారా చూస్తేనే తెలుస్తుంది. అందుకే ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం మెరుపు వీరుడు గ్లెన్ ఫిలిప్సే అని.