జై షా కు 15 ఓట్లే పడ్డాయి... మిగిలిన ఓటు ఆ బోర్డుదేనా?
36 ఏళ్ల వయసులో ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
ఆగస్టు 24న జై షా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నూతన ఛైర్మన్ గా ఆయన ఎంపికయ్యాడు. ఈ క్రమంలో డిసెంబర్ 1 నుంచి అవుట్ గోయింగ్ ఛైర్మన్ క్రెయిగ్ బార్ క్లే (న్యూజిలాండ్) స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తార్డు. 36 ఏళ్ల వయసులో ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
దీంతో... భారత్ నుంచి ఇంతకముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ లుగా పనిచేసిన జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ల తర్వాత ఆ జాబితాలో చేరిన ఐదో వ్యక్తిగా జై షా రికార్డ్ సృష్టించారు! ఆ సంగతి అలా ఉంటే... ఐసీసీలోని 16 మంది సభ్యులలో 15 మంది మాత్రమే ప్రపంచ క్రికెట్ గవర్నింగ్ బాడీకి కొత్త అధ్యక్షుడిగా జై షాకు మద్దతు పలికారు.
అవును... మీడియా కథనాల ప్రకారం ఐసీసీలోని 16 మంది సభ్యుల్లో 15 మంది మాత్రమే కొత్త అధ్యక్షుడిగా జై షాకు మద్దతు పలికారని తెలుస్తోంది. అయితే... ఈ సమయంలో జై షా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఓటు వేయని ఏకైక బోర్డు... పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో పీసీబీ ప్రేక్షక పాత్ర మాత్రమే వహించిందని చెబుతున్నారు.
మరోపక్క క్రికెట్ ఆస్ట్రేలియా.. ఈసీబీ వంటి భారీ బోర్డులు జై షా అభ్యర్థిత్వానికి తమ పూర్తి మద్దతును తెలిపాయని చెబుతున్నారు. అయితే షా ఏకగ్రీవంగా ఎన్నికైనందున పాక్ బోర్డు మౌనాన్ని అంతిమంగా పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో.. షాకు మిగిలిన సభ్యుల నుంచి అధిక మద్దతు ఉన్నందున పీసీబీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు" అని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
జై షా తొలి ప్రాధాన్యత ఇదే!:
గ్రెగ్ బార్క్ లీ స్థానంలో ఐసీసీ కొత్త ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో స్పందించిన జై షా... టెస్టుల ప్రాధాన్యాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. టీ20లంటే సహజంగానే ఉత్సాహాన్నిచ్చే ఫార్మేట్ అని.. కానీ క్రికెట్లో తొలి ప్రాధాన్యం మాత్రం టెస్టులకే అని.. ఆటకు బలమైన పునాది వేసింది అవేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలు పెంచేందుకు తన వంతుగా చేయాల్సిందంతా చేస్తానని జై షా వెల్లడించారు. తాను ఈ కీలక బాధ్యతల్లో అడుగు పెడుతున్న వేళ.. తనపై నెలకొన్న భారీ అంచనాలను అందుకోవడానికి ప్రత్యత్నిస్తానని తెలిపాడు. ఈ అందమైన ఆటకు తాను అంకితమవుతానని జై షా పేర్కొన్నాడు.