బిగ్.. బిగ్ డెసిషన్.. అంతర్జాతీయ క్రికెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై?
టీమ్ ఇండియా టెస్టుల, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతున్నాడనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ లో శకం ముగిసిందా..? వన్డేల్లో ఒక డబుల్ సెంచరీనే కష్టం అనుకుంటే.. మూడు డబుల్ సెంచరీలు కొట్టిన మొనగాడు ఇక బ్యాట్ వదిలేస్తున్నాడా? టి20ల్లో రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు కొట్టిన బ్యాట్స్ మన్ ఇక తప్పుకోనున్నాడా..? టెస్టుల్లో అరంగేట్రంలోనే సెంచరీ బాది.. ఆపై ఆ ఫార్మాట్ కు తగినవాడు కాదని అనిపించుకున్న ఆటగాడు చివరకు టెస్టు కెప్టెన్ గా ఉంటూనే రిటైర్ కానున్నాడా?.. ఈ ప్రశ్నలన్నిటికీ ఔననే సమాధానమే వస్తోంది.
ఇక సెలవ్..
టీమ్ ఇండియా టెస్టుల, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతున్నాడనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావస్కర్ సిరీస్ లో దారుణంగా విఫలం అవుతున్న రోహిత్ ఇక సుదీర్ఘ ఫార్మాట్ ను వదిలేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో రోహిత్ రెండో ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యాడు. దీనికిముందు గులాబీ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ రాణించలేకపోయాడు. ఇక బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టులో 10 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో డగౌట్ వద్దనే తన గ్లౌజ్ లు పడేసి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్నాయి.
పేలవ ఫామ్..
2, 52, 0, 8, 18, 11, 3, 6, 10.. ఇవీ రోహిత్ శర్మ ఇటీవలి టెస్టు స్కోర్లు. 9 ఇన్నింగ్స్ లో ఒక్కటే హాఫ్ సెంచరీ. దీనికిముందు శ్రీలంకతో వన్డే సిరీస్ లోనూ విఫలమయ్యాడు. కనీసం క్రీజులో నిలవలేకపోతున్నాడు. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ వేసిన బంతిని రోహిత్ అత్యంత పేలవంగా ఆడాడు. గులాబీ టెస్టులోనూ బంతిని ఆడేందుకు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. తాజా టెస్టులో ఔట్ అనంతరం తీవ్ర అసంతృప్తితో రోహిత్ తన గ్లౌజ్ లను డగౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. రోహిత్ స్వభావానికి భిన్నంగా ప్రవర్తించిన ఈ సంఘటనతో.. అతడు టెస్టులకు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఈ సిరీస్ లో రోహిత్ ఓపెనింగ్ లో కాకుండా 6వ స్థానంలో వస్తున్నాడు. అయినా పరుగులు చేయలేకపోతున్నాడు. ఇదే కాదు.. రెండేళ్లలో 10 టెస్టుల్లో 18 ఇన్నింగ్స్ కు గాను 621 పరుగులే చేశాడు రోహిత్. ఒకటే సెంచరీ కొట్టాడు. 66 టెస్టులాడిన రోహిత్.. 4,289 పరుగులు చేశాడు. 212 అత్యధిక స్కోరు. 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు కొట్టాడు.
వన్డేలకు కూడానా?
రోహిత్ కు మరొక 4 నెలల్లో 38 ఏళ్లు నిందనున్నాయి. అతడు జూన్ లో టి20 ప్రపంచ కప్ గెలిచాక ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు టెస్టులకూ బైబై చెప్పనున్నాడని అంటున్నారు. ఇక మిగిలింది వన్డేలు. ఈ ఫార్మాట్ లో అతడే కెప్టెన్. అయితే, ఫామ్ గొప్పగా లేనందున వన్డేలకూ రోహిత్ రాం రాం చెప్పే చాన్సుందని తెలుస్తోంది. అదే జరిగితే భారత క్రికెట్ లో ఓ అద్భుత శకం ముగిసినట్లే.