46 పరుగులు.. 36 ఏళ్లు.. న్యూజిలాండ్ కు తొలి టెస్టు గెలుపు

సరిగ్గా నాలుగేళ్ల కిందట ఆస్ట్రేలియాలో గులాబీ బంతి టెస్టులో 36 పరుగులకే ఆలౌటైంది టీమ్ ఇండిదయా.

Update: 2024-10-20 10:54 GMT

సరిగ్గా నాలుగేళ్ల కిందట ఆస్ట్రేలియాలో గులాబీ బంతి టెస్టులో 36 పరుగులకే ఆలౌటైంది టీమ్ ఇండిదయా. మళ్లీ తాజాగా న్యూజిలాండ్ తో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 46 పరుగులకు పరిమితమైంది. సొంతగడ్డపై టీమ్ ఇండియా టెస్టు చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. ఇటీవలి కాలంలో రెండు, మూడు ఓవర్లలో కుర్రాళ్లు కొట్టేస్తున్న స్కోరు ఇది. కానీ, భారత జట్టు మొత్తం ఇంత తక్కువ స్కోరుకే చాప చుట్టేస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే, తొలి ఇన్నింగ్స్ లో చోటుచేసుకున్న ఈ వైఫల్యానికి టీమ్ ఇండియా భారీ మూల్యమే చెల్లించుకుంది.

వాన అడ్డుకోలేదు..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలం. అయితే, బుధవారం ప్రారంభం కావాల్సిన తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రోజంతా మ్యాచ్ జరగలేదు. గురువారం కూడా మ్యాచ్ వర్షం తాలూకు ప్రభావం ఉండగానే మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం దెబ్బకొట్టింది. కేవలం 46 పరుగులకే టీమ్ ఆలౌటైంది. ఇక న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 402 పరుగులు చేయడంతో మ్యాచ్ చేజారే ప్రమాదం కనిపించింది.

రెండో ఇన్నింగ్స్ లో పోరాడినా..

రెండో ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ (150) కొట్టినా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (99) రాణించినా టీమ్ ఇండియా మరీ భారీ స్కోరు చేయలేకపోయింది. కనీసం 550 పైగా పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో? కానీ, 462కు ఆలౌటైంది. దీంతో 17 పరుగుల విజయ లక్ష్యం మాత్రమే కివీస్ ముందు నిలిచింది. ఇక దీనిని న్యూజిలాండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించింది.

వరుణుడూ ఆదుకోలేదు..

నాలుగో రోజు చివర్లో న్యూజిలాండ్ ఛేజింగ్ మొదలైన సమయంలో భారీ వర్షం కురవడంతో ఐదో రోజూ వాన పడి టెస్టు డ్రా అవుతుందేమో? అని భావించారు. కానీ, అలాంటిదేం జరగలేదు. కాసేపు మాత్రమే వరుణఉడు అంతరాయం కలిగించాడు. ఓపెనర్లు కెప్టెన్ టామ్ లేథమ్ (0), డేవన్ కాన్వే (17) ఔటైనప్పటికీ.. వన్ డౌన్ బ్యాటర్ విల్ యంగ్ (48 నాటౌట్), రచిన్ రవీంద్ర (39 నాటౌట్) లాంచనం పూర్తి చేశారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్ మన్, భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

36 ఏళ్ల తర్వాత

తాజా విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు.. భారత్ లో 36 ఏళ్ల తర్వాత మొదటిసారిగా టెస్టు విజయం సాధించింది. చివరిగా 1988లో భారత్‌ లో న్యూజిలాండ్‌ టెస్టు మ్యాచ్‌ గెలిచింది. చరిత్రలో భారత్ లో న్యూజిలాండ్ గెలిచిన మూడో టెస్టు ఇది కావడం గమనార్హం.

Tags:    

Similar News