భారత క్రికెటర్లకు హగ్ లొద్దు.. పాక్ ఆటగాళ్లకు ముందే మెసేజ్ లు
అయితే, పాకిస్థాన్ ఉగ్రవాదానికి సాయం చేస్తున్నందుకు ఆ దేశ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లను బీసీసీఐ రద్దు చేసింది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈ భూగోళంపై ఎక్కడ జరిగినా దానికి ఉండే క్రేజే వేరు.. ప్రస్తుతం వాతావరణం కొంత చల్లబడినా, రెండు, మూడు దశాబ్దాల కిందట రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉద్రిక్తతలు వేరేగా ఉండేవి. అభిమానులు సైతం అంతే తీవ్రంగా స్పందించేవారు. అయితే, పాకిస్థాన్ ఉగ్రవాదానికి సాయం చేస్తున్నందుకు ఆ దేశ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లను బీసీసీఐ రద్దు చేసింది. దాయాదులు ఇప్పుడు తలపడేది కేవలం ఐసీసీ టోర్నీల్లోనే. ఆ సమయంలో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో వచ్చేంసిది.
ఈ నెల 19 నుంచి జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి. ఇక దాయాదులు ఒకే గ్రూప్ లో ఉన్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ తర్వాత భారత్-పాక్ తలపడడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అటు మిగతా ప్రపంచం కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది.
చాంపియన్స్ ట్రోఫీ 19న మొదలుకానుంది. 20న భారత్ మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఇక భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ 23న జరగనుంది. ఇటీవలి కాలంలో రెండు ఐసీసీ టోర్నీల్లో పాక్ మీద భారత్ దే విజయం. అందుకని ఎలాగైనా టీమ్ ఇండియాను చిత్తు చేయాలని పాక్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ రూపంలో పాకిస్థాన్ కు దశాబ్దం అనంతరం ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశం దక్కింది. అంతకుముందు వన్డే ప్రపంచ కప్ కోసం భారత్ లో పర్యటించింది ఆ దేశ జట్టు. అయినా.. భారత్ మాత్రం పాకిస్థాన్ కు వెళ్లే ప్రసక్తే లేదంటోంది. దీంతో పాక్ అభిమానులు రగిలిపోతున్నారు. భారత ఆటగాళ్లకు ఎవరూ కౌగిలింతలు (హగ్) ఇవ్వొద్దని తమ క్రికెటర్లను హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కొసమెరుపు: 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. నాడు లీగ్ దశలో పాకిస్థాన్ ను భారత జట్టు మట్టికరిపించగా, ఫైనల్లో భారత్ కు పాక్ ఝలక్ ఇచ్చింది.