వరల్డ్ కప్ టీమిండియా ఇదే.. ఆ ప్లేయర్ ను మోసేశారు.. తి'లక్' దూరం

ఆరు నెలలైంది వన్డే ఆడి.. నాలుగు నెలలైంది మ్యాచ్ ప్రాక్టీస్ లేక.. కానీ ఆ ఆటగాడికి వన్డే ప్రపంచ కప్ లో చోటు దక్కింది.

Update: 2023-09-05 09:59 GMT

ఆరు నెలలైంది వన్డే ఆడి.. నాలుగు నెలలైంది మ్యాచ్ ప్రాక్టీస్ లేక.. కానీ ఆ ఆటగాడికి వన్డే ప్రపంచ కప్ లో చోటు దక్కింది. గాయం నుంచి ఇటీవలే కోలుకున్నా.. ఇంకా ఫిట్ నెస్ సమస్యలున్నా.. ప్రతిష్ఠాత్మక టోర్నీలో అతడికి జట్టులో చోటు దక్కింది. ఫామ్, జట్టు కూర్పు విషయంలో ఏ మాత్రం తేడా అనిపించినా మిగతా జట్లు ఆటగాడిని పక్కనపెడుతున్న పరిస్థితుల్లో టీమిండియా సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్ మెంట్ మాత్రం దీనికి భిన్నమైన నిర్ణయం తీసుకుంది.

శాంసన్ లేడు.. రాహుల్ వచ్చాడు

సరిగ్గా నెల రోజుల్లో భారత్ లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్ నకు టీమిండియాను ప్రకటించారు. 15 మంది జట్టు సభ్యుల ప్రకటనకు మంగళవారం (సెప్టెంబరు 5) చివరి రోజు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తమ జట్లను వెల్లడించాయి. భారత్ తాపీగా చివరి రోజున ప్రకటించింది. కొలంబోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ 15 మంది సభ్యుల జట్టును వెల్లడించారు. గాయాలతో కొన్ని నెలల నుంచి పోటీ క్రికెట్ ఆడని కేఎల్ రాహుల్ కు, ఆసియా కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో పునరాగమనం చేసిన శ్రేయాస్ అయ్యర్ కు చోటుదక్కింది. టి20ల్లో 360 డిగ్రీల ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ కూ స్థానం లభించింది.

ఇదీ కూర్పు..

కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ లో జట్టును నడిపిస్తారు. కాగా, బ్యాటింగ్, బౌలింగ్, పేస్-స్పిన్ ఆల్ రౌండర్ల ప్రకారం జట్టును పరిశీలిస్తే.. రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్, సూర్య ,రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్లు. రాహుల్ తో పాటు ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా ఉంటాడు. పేసర్లుగా బుమ్రా, షమీ, సిరాజ్, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లుగా పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వ్యవహరిస్తారు. స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు చోటుదక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ పాత్ర కుల్దీప్ యాదవ్ దే.

హైదరాబాదీకి నిరాశ, చాహల్ కు మొండిచేయి

వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు మరోసారి నిరాశే మిగిలింది. అయితే, మూడు నెలల్లో అందరినీ ఆకట్టుకున్న హైదరాబాదీ కుర్రాడు, ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ తిలక్ వర్మకు చోటుదక్కలేదు. కర్ణాటక పేసర్ ప్రసిధ్ కృష్ణతో పాటు వికెట్ కీపర్‌ సంజు శాంసన్‌ దీ ఇదే పరిస్థితి.

రాహుల్ కు ఎందుకంత ప్రాధాన్యం?

ప్రతిభావంతుడే అయినప్పటికీ అందుకుతగినట్టు రాణించని కేఎల్ రాహుల్ ను ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయడం చర్చనీయాంశమే. అతడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో విలువైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఐదు నెలలుగా అతడు అంతర్జాతీయ మ్యాచే ఆడలేదు. నాలుగు నెలలుగా మైదానంలోకే దిగలేదు. అలాంటివాడిని ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయడం సరైనదేనా? అన్నది ప్రశ్న. ఇక్కడ ఇంకో సమస్య ఏమంటే.. రాహుల్ కు వికెట్ కీపింగ్ కూడా అప్పగిస్తారు. అంటే అతడు తుది జట్టులో కచ్చితంగా ఉంటాడు. అలాంటప్పుడు అద్భుతంగా రాణిస్తున్న ఇషాన్ కిషన్ పరిస్థితి ఏమిటి..? ఎడమచేతి వాటం ప్రత్యేకత ఉన్న అతడికి తుది జట్టులో చోటు కష్టమే కదా? అయినా రాహుల్ కంటే తిలక్ నో, శాంసన్ నో, జైశ్వాల్ వంటి కుర్రాడినో ఎంపిక చేయొచ్చు కదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

కొసమెరుపు: మంచి ఫామ్ లో ఉన్న అంబటి రాయుడిన పక్కనపెట్టి.. ఇంగ్లండ్ లో జరిగిన 2019 ప్రపంచ కప్ నకు నాలుగో స్థానానికి అనూహ్యంగా విజయ్ శంకర్ ను ఎంపిక చేసింది అప్పటి సెలక్షన్ కమిటీ. దీనికి చైర్మన్ తెలుగు వాడైన ఎమ్మెస్కే ప్రసాద్. విజయ్ శంకర్ ను త్రీడీ ప్లేయర్ గానూ ఆయన అబివర్ణించారు. కానీ, ఇదెంతటి తప్పిదమో తర్వాత తెలిసింది. ఇప్పుడు అగార్కర్ కమిటీ కూడా.. రాహుల్ విషయంలో ఇలానే వ్యవహరించిందా? అనే అనుమానం తలెత్తతోంది.

Tags:    

Similar News