ఏపీలో మరో స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల భాగ్యం..? ఇక అంతా శుభమంగళమే..

ప్రస్తుతం విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఏపీలోని మంగళగిరి స్టేడియంలోనూ కొన్ని మ్యాచ్ లు జరిగేలా చూడాలనుకుంటున్నారు.

Update: 2025-01-20 15:30 GMT

చూస్తుండగానే సమ్మర్ వచ్చేసింది.. సరిగ్గా మరొక్క రెండు నెలలు.. అంతే.. మార్చి 21 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ చాలా స్పెషల్ అనుకోవాలి. ఎందుకంటే అనేక కొత్త నిబంధనలు.. కొత్త ఆటగాళ్లు.. సగంపైగా కొత్త కెప్టెన్లు.. వీటికి తోడు ఏపీ ప్రజలకు మరో కొత్త అనుభూతి కూడా కలగనుంది.

ఉత్తరప్రదేశ్.. భారత దేశంలో వెనుకబడిన రాష్ట్రం.. పశ్చిమ బెంగాల్.. పెద్దగా డెవలప్ మెంట్ లేని రాష్ట్రం..కానీ, ఈ రాష్ట్రాల రాజధానుల పేరిటి ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ టీమ్ లు ఉన్నాయి. మరి తెలుగు వారికి..? దక్కన్ చార్జర్స్ అని హైదరాబాదీ నేపథ్యంతో టీమ్ ఉన్నా.. అది చివరకు తమిళ సంస్థ సన్ రైజర్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. తెలుగు రాష్ట్రాలు రెండుగా అయ్యాక ఏపీకి అయినా ఐపీఎల్ టీమ్ ఏర్పడలేదు. కొద్దొగొప్పో ఉపశమనం ఏమంటే.. తెలుగువారైన ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి మల్లికార్జున రావు గ్రూప్ ఆధ్వర్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాచైంజీ ఉంది.

గత సీజన్ వేరు.. ఈ సీజన్ వేరు.. 2024లో ఐపీఎల్ జరిగే నాటికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక వచ్చే సీజన్ కు సంబంధించి కూటమి సర్కారు ఓ ఆలోచన చేస్తోందట. సొంత జట్టు సంగతి పక్కనపెడితే.. ముందుగా ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహణకు ఏర్పాటు సాగిస్తోందట.

ప్రస్తుతం విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఏపీలోని మంగళగిరి స్టేడియంలోనూ కొన్ని మ్యాచ్ లు జరిగేలా చూడాలనుకుంటున్నారు.

మంగళగిరిలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉండగానే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని నిర్మించాలని తలపెట్టారు. మధ్యలో ఆగినా ఇప్పుడు మళ్లీ పుంజుకొన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ ల నిర్వహణకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు.

కాగా, ఐపీఎల్ ప్రారంభ ముగింపు తేదీలు వెలువడినా షెడ్యూల్ ఖరారు కాలేదు. దీనికిముందే రాష్ట్రాల క్రికెట్ సంఘాల నుంచి బీసీసీఐ మైదానాల వివరాలు తీసుకుంటుంది. ఒకవేళ ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) గనుక మంగళగిరి స్టేడియాన్ని సిద్ధం చేస్తామన్న భరోసా ఇస్తే.. కచ్చితంగా మ్యాచ్‌ లు కేటాయించే చాన్సుంది.

ఒకవేళ మంగళగిరిలో గనుక మ్యాచ్ లు జరిగితే అది ఏపీ రాజధాని అమరావతికి బూస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. మరింత చొరవ చూపితే తదుపరి అంతర్జాతీయ మ్యాచ్ లూ దక్కొచ్చు.

Tags:    

Similar News