ధోనీ కోసం ఐపీఎల్ రూల్స్ చేంజ్.. 'అన్ క్యాప్డ్' అందుకు నిదర్శనం
ఆ తర్వాత ఏడాదిపైగా మౌనంగా ఉండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇటీవల వెల్లడై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 18 నిబంధనలు చర్చనీయాంశంగా మారాయి. మరీ ముఖ్యంగా అన్ క్యాప్డ్ ప్లేయర్ విషయంలో.. ఐదేళ్లు జాతీయ జట్టుకు ఆడకుంటే అలాంటివారిని అన్ క్యాప్డ్ పరిగణించే రూల్ ఇది. అంటే.. 2020 ఆగస్టు 15న రిటైరైన భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీకి ఇప్పుడు అన్ క్యాప్డ్. అదేంటి ధోనీ.. రిటైరై నాలుగేళ్లే కదా అయింది అనుకోవచ్చు. కానీ, అతడు చివరిగా మ్యాచ్ ఆడింది 2019 వన్డే ప్రపంచ కప్ లో. ఆ తర్వాత ఏడాదిపైగా మౌనంగా ఉండి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీన్నిబట్టి చూస్తే ధోనీ జాతీయ జట్టుకు ఆడక ఐదేళ్లు.
కాంట్రాక్టూ లేదు.. దేశానికి ఆడలేదు..
ఐపీఎల్ 18కి సంబంధించి బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం ఏ భారత ఆటగాడైనా ఐపీఎల్ సీజన్ కు ముందు అయిదేళ్లు అంతర్జాతీయ క్రికెట్ తుది జట్టు (టెస్టు, వన్డే, టీ20)లో లేకున్నా.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందలేకపోయినా.. అతడిని అన్ క్యాప్డ్ ప్లేయర్ అని భావిస్తారు. ఇది భారత ఆటగాళ్లకు మాత్రమే. కాగా, ధోనీ గత సీజన్ లోనే కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. వికెట్ కీపర్ గా వేలాది మ్యాచ్ లలో మోకాళ్లపై నిలిచిన ధోనీ మోకాలి గాయంతో అతడు ఇబ్బంది పడుతున్నాడు. సీజన్ ముగిశాక సర్జరీ చేయించుకున్నాడు. కాగా, తన భవిష్యత్ పై మాట్లాడుతూ.. ఐపీఎల్ రిటెన్షన్ నిబంధనలు వెలువడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాన్నాడు. ఆ నిబంధనలు వెల్లడైన ప్రకారం చూస్తే..చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని రిటైన్ చేసుకొనే అవకాశం ఉంది. అయితే, అది కేవలం రూ.4 కోట్లకే. ఎందుకంటే ధోనీ అన్ క్యాప్డ్ కాబట్టి.
ఈ రూల్ ధోనీ కోసమేనా?
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఐపీఎల్ రూల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కోసం రూల్స్ మారుతూనే ఉంటాయన్నాడు. అన్ క్యాప్డ్ ను మనసులో ఉంచుకుని అతడిలా మాట్లాడాడు. ధోనీ ఫిట్ గా ఉన్నాడని చెబుతూనే.. అతడు ఆడాలని కోరుకున్నంత కాలం ఐపీఎల్ రూల్స్ మారుతైనే ఉంటాయన్నాడు.
ఐదేళ్లు కాదు మూడేళ్లయితే..
అన్ క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించడానికి ఐదేళ్ల సమయం కంటే.. మూడేళ్ల గడువు విధించాల్సిందని సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ అంటున్నాడు. అయితే, అన్ క్యాప్డ్ నిబంధన టోర్నీకి మేలే చేస్తుందని వ్యాఖ్యానించాడు. ఆటగాడిలో సత్తా ఉంటే.. సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలు కల్పిస్తుందని తెలిపాడు. ధరల విషయంలో వారిని రిటైన్ చేసుకోవడం కష్టం చేస్తే జట్లకు ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నాడు. కొందరు ఆటగాళ్లు తమతమ జట్లకు ప్రత్యేక గుర్తింపుగా మారారని.. చెన్నై విషయంలో ధోనీనే దీనికి నిదర్శమని ప్రస్తావించాడు. మొత్తానికి అన్ క్యాప్డ్ నిబంధన కథేమిటో.. ధోనీ అసలు వచ్చే సీజన్ ఆడతాడో లేదో.. నవంబరులో జరిగే ఐపీఎల్ మెగా వేలంలో తేలనుంది.