2 టోపీలు.. 2 ట్రోఫీలు.. పాక్ తో మ్యాచ్ కు ముందు బూమ్ బూమ్ బుమ్రా
టి20 ప్రపంచ కప్ విజయం సహా 2024లో అద్భుతంగా రాణించిన బుమ్రాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ గా ఎంపిక చేసింది.
టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న దుబాయ్ మైదానంలో మెరిశాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు టీమ్ సభ్యులతో కలివిడిగా కనిపించాడు. మ్యాచ్ లో మనదే గెలుపని హుషారు పరిచాడు. స్టార్ పేసర్ ను చూసిన అభిమానుల ఆనందానికైతే హద్దే లేదు.. అరె అదేంటి..? అసలు బుమ్రా జట్టులోనే లేడు కదా..? గాయంతో టీమ్ కు దూరమయ్యాడు కదా..? అతడు దుబాయ్ కి ఎందుకొచ్చాడు..? జట్టుతో ఎలా కలిశాడు..? ఇవి కదా మీకు వస్తున్న సందేహాలు..? అవును మీ డౌట్లు నిజమే. కానీ, అందులో ఓ మెలిక ఉంది.
వెన్నుగాయంతో బుమ్రా టీమ్ ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీంతో ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగిన సిరీస్ లకు ఎంపిక చేయలేదు. మ్యాచ్ విన్నర్ కాబట్టి చాంపియన్స్ ట్రోఫీకి కచ్చితంగా తీసుకుంటారని భావించినా, అదీ సాధ్యం కాలేదు. కానీ, బుమ్రా ట్రోఫీ జరుగుతున్న దుబాయ్ లో ప్రత్యక్ష్యమయ్యాడు. ఎందుకంటే..?
బుమ్రా 2024లో విశేషంగా రాణించిన సంగతి తెలిసిందే. 2022లో గాయపడిన అతడు 2023 లో జరిగిన వన్డే ప్రపంచ కప్ నకు కొద్దిగా ముందు అందుబాటులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 30కి పైగా వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. కానీ, చివరి టెస్టు సందర్భంగా బ్యాడ్ లక్ వెంటాడింది. మళ్లీ గాయపడడంతో జట్టుకు దూరమయ్యాడు.
టి20 ప్రపంచ కప్ విజయం సహా 2024లో అద్భుతంగా రాణించిన బుమ్రాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ గా ఎంపిక చేసింది. అంతేకాదు.. 2024 ఐసీసీ టెస్టు, టీ20 జట్లలోనూ బుమ్రాకు చోటు దక్కింది. దీంతో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కు గాను ట్రోఫీలు, 2024 టెస్టు, టి20 టీమ్ మెంబర్ అయినందుకు టోపీలు అందుకునేందుకు బుమ్రా దుబాయ్ వచ్చాడు.
సరిగ్గా పాక్ తో మ్యాచ్ కు ముందు టోపీలు, ట్రోఫీలు తీసుకునేందుకు బుమ్రా రావడంతో అభిమానుల్లో జోష్ కనిపించింది. దీనికిముందు వార్మప్ డ్రిల్స్ సందర్భంగా టీమ్ ఇండియా సహచరులను కలిశాడు.