భారత ఆటగాళ్లపై కపిల్‌ దేవ్‌ ఆగ్రహం... తెరపైకి డబ్బు, అహంకారం!

హర్యానా హరికేన్ కపిల్ దేవ్ తాజాగా ప్రస్తుతమున్న క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Update: 2023-07-30 10:39 GMT

కపిల్ దేవ్... ఒక ఏజ్ గ్రూప్ వారికి క్రికెట్ దేవుడు! అప్పట్లో ఎక్కడ చూసినా కపిల్ దేవ్ పేరే వినిపించేదన్నా అతిశయోక్తి కాదేమో. అలాంటి అలనాటి మేటి క్రికెటర్, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ తాజాగా ప్రస్తుతమున్న క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అవును... 1983లో భారత క్రికెట్ జట్టుకు ప్రపంచ కప్‌ ను అందించిన కెప్టెన్ కపిల్ దేవ్.. తాజాగా టీమిండియా ఆటగాళ్ళపై మండిపడ్డారు. ఆటగాళ్ళలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదేనని కానీ, ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం మైనస్ పాయింట్ అని అన్నారు. ఈ సందర్భంగా చాలా మంది క్రికెటర్లకు సలహాలు, సూచనలు అవసరమన్నారు.

గత తరం ఆటగాళ్లు ఏవైనా సందేహాలు ఉంటే తన వద్దకు వచ్చేవారని.. ఇప్పటి ప్లేయర్లు మాత్రం అలా ఉండటం లేదని ఇటీవల సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవస్కర్ వ్యాఖ్యలకు మరో భారత దిగ్గజం కపిల్ దేవ్ మద్దతు తెలుపుతూ ఇప్పటి తరం ఆటగాళ్లపై తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్భంగా ప్రస్తుత తరం ఆటగాళ్లు ఇలా తయారు కావడానికి మూడు అంశాలే ప్రధాన కారణమని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. సంపద, పొగరు, అహం వల్లే సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి ఆసక్తి కనపరచడం లేదన్నట్లు అనిపిస్తోందని తెలిపాడు. బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ ఏదైనా సరే నిరంతరం నేర్చుకుంటూనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు.

ఇదే సమయంలో... మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు నామోషీ ఎందుకని అడిగారు. అనంతరం... తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని... వాస్తవానికి వారికి అంతా తెలియదని కపిల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

Tags:    

Similar News