6 మ్యాచ్ ల్లో 5 సెంచరీలు.. ‘ట్రిపుల్’ సెంచూరియన్ సూపర్ ఫామ్

కరుణ్ నాయర్ పేరు ఇప్పుడు దేశవాళీ టోర్నీ విజయ్ హజారేలో మార్మోగుతోంది. 6 మ్యాచ్ లలో ఐదు సెంచరీలు (ఇందులో నాలుగు సెంచరీల్లో నాటౌట్) కొట్టడమే దీనికి కారణం.

Update: 2025-01-13 14:30 GMT

90 ఏళ్లపైగా చరిత్ర ఉన్న భారత టెస్టు క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు వీరేంద్ర సెహ్వాగ్. ఇతడు రెండుసార్లు ట్రిపుల్ కొట్టాడు. వీరూ గురించి అందరికీ తెలుసు. కానీ, ట్రిపుల్ బాదిన మరో ప్లేయర్ ఎవరు? అంటే ఎవరూ తొందరగా చెప్పలేరు. కారణం.. ఆ ట్రిపుల్ సెంచరీ తర్వాత అతడు పెద్దగా ఆడలేదు. జట్టుకు దూరమయ్యాడు.

2016-17 సీజన్ లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ పై ట్రిపుల్ సెంచరీ కొట్టాడు కరుణ్‌ నాయర్. అప్పుడే ఇంగ్లండ్‌ తో మూడు, తర్వాత ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు ఆడి 374 పరుగులు చేశాడు. కానీ, ఆస్ట్రేలియాపై విఫలంతో సంవత్సరానికే జట్టులో చోటు పోయింది. ఎనిమిదేళ్ల నుంచి అతడు జట్టులోకి రాలేదు.

కరుణ్ నాయర్ పేరు ఇప్పుడు దేశవాళీ టోర్నీ విజయ్ హజారేలో మార్మోగుతోంది. 6 మ్యాచ్ లలో ఐదు సెంచరీలు (ఇందులో నాలుగు సెంచరీల్లో నాటౌట్) కొట్టడమే దీనికి కారణం. మరీ ముఖ్యంగా గత ఐదు మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు కొట్టాడు. మరో మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగలేదు. దీంతో కరుణ్ విషయం ఏంచేయాలి? అనే సందేహం సెలక్టర్లకు కలిగించాడు. కాగా, విజయ్ హజారే టోర్నీలో ఔట్‌ కాకుండా 600 పైగా పరుగులు చేసిన ఆటగాడిగా కరుణ్ ఘనత సాధించాడు.

కర్ణాటకకు చెందిన కరుణ్ నాయర్.. పరిస్థితులు, పోటీ రీత్యా ప్రస్తుతం విదర్భకు ఆడుతున్నాడు. ఈ జట్టు ఫైనల్ కు చేరడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.

కాగా, కరుణ్ ఇదే ఫామ్ కొనసాగిస్తే ఇంగ్లండ్‌ తో వన్డే సిరీస్‌, చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేయక తప్పదు. లేదంటే బీసీసీఐపై విమర్శలు రావడం ఖాయం. ఐపీఎల్ లో రాణించిన వారిని ఎంపిక చేసే సెలక్టర్లు.. దేశవాళీల్లో దుమ్మురేపిన కరుణ్ ను ఎలా పట్టించుకోరంటూ మండిపడే ప్రమాదం ఉంది.

కాగా, 2022 డిసెంబరులో డియర్ క్రికెట్ నాకొక చాన్సివ్వు అంటూ కరుణ్ పోస్టు పెట్టాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది. అప్పట్లో అతడు ఆరేడు నెలలు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. మూడు గంటల పాటు ప్రయాణించి కేవలం ప్రాక్టీస్‌ మాత్రమే చేసేవాడు.

కాగా కరుణ్ ఐపీఎల్ మెగా వేలం తొలి దశలో అన్ సోల్డ్ గా మిగిలాడు. రెండో రౌండ్ లో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. రూ.50 లక్షలు వెచ్చించింది. ఫిట్ నెస్, బ్యాటింగ్ టెక్నిక్ కూడా మార్చుకున్న 33 ఏళ్ల కరుణ్.. టీమ్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్ ఫామ్ గొప్పగా లేదు కాబట్టి. రోహిత్, కోహ్లి స్థాలను భర్తీచేయగల వారి కోసం వెదికే క్రమంలో కరుణ్ లక్ వరించవచ్చు. వయసు రీత్యా మరో రెండు మూడేళ్లు అతడు కెరీర్ కొనసాగించే చాన్సుంది.

Tags:    

Similar News