ఒక్క హెల్మెట్.. గుజరాత్ ను ఇంటికి పంపింది.. కేరళను ఫైనల్ చేర్చింది..

రంజీ ట్రోఫ్ సెమీస్ పోరు అది.. గుజరాత్ వర్సెస్ కేరళ భీకరంగా పోరాడుతున్నాయి.. కానీ అదృష్టం అనేది ఒకటి ఉంటుంది. అది కేరళ పక్షాన నిలిచింది.

Update: 2025-02-22 04:26 GMT

రంజీ ట్రోఫ్ సెమీస్ పోరు అది.. గుజరాత్ వర్సెస్ కేరళ భీకరంగా పోరాడుతున్నాయి.. కానీ అదృష్టం అనేది ఒకటి ఉంటుంది. అది కేరళ పక్షాన నిలిచింది. ఫైనల్ చేరాల్సిన గుజరాత్ ను దురదృష్ట దేవత వెనక్కి లాగింది. దీంతో గుజరాత్ ఇంటికి.. కేరళ ఫైనల్ కు వెళ్లింది. దీనంతటికి కారణం ఒక హెల్మెట్.. అదే గుజరాత్ ను ఫైనల్ రేసు నుంచి దూరంగా జరిపింది. విధి ఆడిన వింత ‘ఆట’లో పాపం బలైంది గుజరాత్ జట్టు. ఈ రంజీ మ్యాచ్ లో ఊహించని పరిణామం ఇప్పుడు క్రీడా వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

‘మొండిగా పోరాడితే విజయం దానంతట అదే వస్తుందని’ కేరళ జట్టు నిరూపించింది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, 352 మ్యాచ్‌ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో అద్వితీయ ప్రదర్శన కనబరిచిన కేరళ జట్టు, ఉత్కంఠ భరితంగా జరిగిన సెమీఫైనల్లో మాజీ చాంపియన్‌ గుజరాత్‌పై విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.

క్వార్టర్‌ ఫైనల్లో కేవలం ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో జమ్మూ కశ్మీర్‌ను వెనక్కి నెట్టిన కేరళ, సెమీఫైనల్లో గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో తుదిపోరుకు అడుగుపెట్టింది. చిన్న పరుగు తేడా పెద్ద విజయాలకు దారి తీస్తుందనే విషయాన్ని కేరళ తన ప్రదర్శన ద్వారా నిరూపించింది. ఆరు దశాబ్దాలుగా రంజీ ట్రోఫీలో పోటీపడుతున్నా ఫైనల్‌ చేరలేకపోయిన కేరళ, ఈసారి అసాధారణ ఆటతో ఆ కలను సాకారం చేసుకుంది.

జమ్మూ కశ్మీర్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్‌లో కేవలం ఒక పరుగు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన కేరళ, సెమీఫైనల్లో గుజరాత్‌పై రెండు పరుగుల ఆధిక్యంతో తుదిపోరుకు చేరింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌ చివరి రోజు కేరళ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. గుజరాత్‌ జట్టుకు చివరి మూడు వికెట్లతో మరో 29 పరుగులు అవసరమైన తరుణంలో, కేరళ బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో ప్రత్యర్థిని అణిచివేశారు.

గుజరాత్‌ బ్యాటర్లు జైమీత్‌ పటేల్‌, సిద్ధార్థ్‌ దేశాయ్‌లను కేరళ బౌలర్‌ ఆదిత్య ఔట్‌ చేయడంతో కేరళ విజయానికి చేరువైంది. అయితే, ఆఖరి వికెట్‌కు అర్జాన్‌ నాగ్‌వస్వల్లా, ప్రియజీత్‌ సింగ్‌ జడేజా ధీటుగా పోరాడారు. పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంట కారణంగా మ్యాచ్‌ గుజరాత్‌ వైపు మొగ్గుతుందనిపించినా, అర్జాన్‌ కొట్టిన ఒక షాట్‌ కేరళకు అదృష్టాన్ని తీసుకువచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్‌ బలంగా ఆడగా, బంతి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సల్మాన్‌ నిజార్‌ హెల్మెట్‌కు తాకి గాల్లోకి లేచింది. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న కెప్టెన్‌ సచిన్‌ బేబీ క్యాచ్‌ పట్టడంతో కేరళ సంబరాల్లో మునిగిపోయింది.

ఈ అద్భుత ప్రదర్శనతో కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించింది. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంగా పోరాడిన ఈ జట్టు, ఎట్టకేలకు తుదిపోరుకు అర్హత సాధించి తమ పట్టుదల, కృషిని చాటిచెప్పింది.

Tags:    

Similar News