ఐపీఎల్ 2025లో కీలక మార్పులు! రోహిత్ అలా, ధోనీ కోసం సీఎస్కే ఇలా!!
వాస్తవానికి ఇప్పటివరకూ నలుగురిని మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ 18 కు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఐపీఎల్ మెగావేలం టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో... ఐపీఎల్ - 2025 గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త తెరపైకి వస్తోంది. ఇందులో భాగంగా... ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు వస్తున్నాయి.
అవును... ఈ ఏడాది చివర్లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని, కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ.. ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల రిటైన్షన్, జట్టు పర్స్ పెంపుపై దృష్టిసారించాలని కోరుతున్నాయి ఫ్రాంచైజీలు.
వాస్తవానికి ఇప్పటివరకూ నలుగురిని మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. అయితే... ఆ సంఖ్యను ఈసారి ఆరుకు పెంచాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరుతుండగా.. ఐపీఎల్ టాప్ జట్టు ఒకటి మాత్రం ఎనిమిది మందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే... వీటిలో పర్స్ విలువ మాత్రం 20 నుంచి 25 శాతం తప్పకుండా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక మిగిలిన.. ఆటగాళ్ల రిటెన్షన్ వ్యవహారం మాత్రం అతిపెద్ద సమస్యగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేలంతో పనిలేకుండా బయటే ఆటగాళ్లను కొనుగోలు చేయడం (రైట్ టు మ్యాచ్) తో కలిపి రిటెన్షన్ లో ఎనిమిది మందికి అవకాశం ఇవ్వాలనే వాదన కాస్త బలంగా వినిపిస్తుండగా.. బీసీసీఐ మాత్రం ఆరుగురికి అనుమతిచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఈసారి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో “ఇంపాక్ట్ ప్లేయర్” అంశం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ఆల్ రౌండర్లపై ప్రభావం పడుతుందని, 12 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వస్తోందని రోహిత్ చెబుతున్నాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం...ఎం.ఎస్.ధోని వంటి దిగ్గజ క్రికెటర్ ను మరికొంతకాలం కొనసాగించేందుకు ఈ నిబందన ఉపయోగపడుతుందని వాదిస్తోంది!