భూమ్మీద గ్రహాంతర వాసి కోహ్లి.. అలాంటోడు ఏలియన్స్ ను నమ్ముతాడట
16 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ పై తనదైన ముద్ర వేస్తున్నాడు అతడు.
ఈ అనంత విశ్వంలో భూమి మీద కాక.. మరెక్కడైనా జీవం ఉందా..? అక్కడి వారు ఎలా ఉంటారు.? భూమ్మీద మానవుల కంటే.. అడ్వాన్స్ గా ఉంటారా? లేక ఆది మానవుల్లా ఉన్నారా? అని ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. అవతార్ సినిమాలో చూపించినట్లు వేరే గ్రహంపై జీవం ఉందని నమ్మేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కాగా.. వీరిలో సాధారణ మానవుల నుంచి ప్రముఖులూ ఉన్నారు. ఇలాంటివాడే టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. మైదానంలో ఎంతో ప్రోగ్రెసివ్ గా ఉండే కోహ్లి.. జీవితాన్నీ అంతే చాలెంజింగ్ గా తీసుకున్నాడు. 16 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయినా రంజీ మ్యాచ్ ఆడి జట్టును గట్టెక్కించిన ప్రత్యేకత అతడిది. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాక అనేక రికార్డులను బద్దలుకొట్టి దిగ్గజంగా ఎదిగాడు. 16 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ పై తనదైన ముద్ర వేస్తున్నాడు అతడు.
తనను తాను తీర్చిదిద్దుకుని..
2008లో టీమ్ ఇండియాలోకి వచ్చిన కోహ్లి 2011-12 మధ్య వేటుకు గురయ్యాడు. తిరిగి వచ్చాక మోస్తరుగా ఆడిన అతడు 2015 తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయాడు. అద్భుతమైన ఫిట్ నెస్ తో ఎవరికీ సాధ్యం కాని రీతిలో నిలిచాడు. అలాంటి సెల్ఫ్ మేడ్ కోహ్లి.. గురించి ఆశ్చర్యకర విషయాన్ని భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. కోహ్లికి గ్రహాంతర వాసులు ఉన్నారనే నమ్మకం ఉందని తెలిపాడు. స్వతహాగా తాను గ్రహాంతర వాసులను నమ్మనని.. అంతగా అవగాహన కూడా లేదని చెప్పిన కార్తీక్.. కోహ్లికి మాత్రం బాగా నమ్మకం అని చెప్పకొచ్చాడు. అంతేకాదు.. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో కనిపించిన గ్రహాంతర వాసుల గురించిన వీడియోను కార్తీక్ కు కోహ్లి చూపించాడట. కాగా, గ్రహాంతర వాసుల గురించి అమెరికన్లకు బాగా భయాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి అమెరికాలో రికార్డయిన వీడియోను కోహ్లి చూపడం గమనార్హం. కాగా, 2004లో భారత జట్టుకు ఎంపికైన కార్తీక్.. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. గత ఏడాదితో రిటైర్ అయ్యాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రెండు దఫాలు ఆడాడు. ఈ ఏడాది కూడా బెంగళూరుకు ఆడి రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ లో బెంగళూరుకు దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ కోచ్, మెంటార్ గా ఉండేలా ఒప్పందం చేసుకున్నారు.