ఐదు గంటల 35 నిమిషాల మ్యాచ్.. క్రికెట్ టి20 కాదు.. టెన్నిస్ పోటీ

మళ్లీ పుంజుకున్నారు.. మొత్తానికి ఓ మహా సమరాన్ని అభిమానులకు అందించారు. ఇంతకూ ఇదంతా ఏమిటంటే..

Update: 2024-08-28 06:36 GMT

అమ్మో అంత సమయమా? అనిపించేలా.. అబ్బో ఇది క్రికెట్ మ్యాచ్ లా ఉంది అని భావించేలా.. ఇంకా ఎంతసేపు అని విసిగించేలా సాగిందో మ్యాచ్.. ఇద్దరూ పెద్ద స్టార్లేం కాదు.. కానీ, అంతర్జాతీయ స్థాయికి వచ్చారంటే మంచి ఆటగాళ్లనేగా..? అందుకే హోరాహోరీగా తలపడ్డారు. ఒకరిపై మరొకరిది పైచేయి అనిపించుకున్నారు. అంతలోనే ఆధిక్యం చేజార్చుకున్నారు. మళ్లీ పుంజుకున్నారు.. మొత్తానికి ఓ మహా సమరాన్ని అభిమానులకు అందించారు. ఇంతకూ ఇదంతా ఏమిటంటే..

టి20 కాదు..

ఆధునిక ఫార్మాట్ అయిన క్రికెట్ టి20 మ్యాచ్ నిడివి దాదాపు 5 గంటలపైనే. ఇంకాస్త ముందుకుసాగితే సూపర్ ఓవర్ వంటివి అరుదుగా జరుగుతాయి. కాగా, టి20 మ్యాచ్ అనదగ్గ, అంతటి సమయం పాటు జరిగింది ఓ మ్యాచ్. అయితే, అది క్రికెట్ మ్యాచ్ కాదు. టెన్నిస్ లో ఏడాది చివరి గ్రాండ్ స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ మ్యాచ్. అమెరికాలో జరుగుతున్న ఈ గ్రాండ్ స్లామ్ లో తొలి రౌండ్ పోటీలు జరుగుతన్నాయి. అయితే, ఈ టోర్నీ చరిత్రలో అరుదైన మ్యాచ్ బ్రిటన్‌ ఆటగాడు డేనియల్ ఇవాన్స్, రష్యా యువకుడు కరెన్ ఖచనోవ్ మధ్య జరిగింది.

ఐదు సెట్లు.. మూడు టై బ్రేకర్లు

పురుషుల టెన్నిస్ లో ఐదు సెట్ల పోటీ ఉంటుంది. మహిళలు అంతసేపు ఆడలేరు కాబట్టి మూడు సెట్లకు పరిమితం చేశారు. కాగా, ఖచనోవ్, ఇవాన్స్ మధ్య పోటీ ఆద్యంతం ఉత్కంఠతతో ఐదు సెట్ల పాటు సాగింది. అలా 5.35 గంటలు కొనసాగింది. చివరకు ఇవాన్స్‌ నెగ్గాడు. వాస్తవానికి ఇతడు బ్రిటన్ నంబర్ వన్ ర్యాంకర్. కానీ, పడిపోతూ వచ్చాడు. ఇప్పుడు ప్రపంచ 184వ ర్యాంకులో ఉన్నాడు. ఖచనోవ్ తో మ్యాచ్ లో ఇవాన్స్‌ 6-7 (6), 7-6 (2), 7-6 (4), 4-6, 6-4 తేడాతో గెలిచాడు. జాగ్రత్తగా చూస్తే ఇందులో మొదటి మూడు సెట్లూ టై బ్రేక్‌. దీన్నిబట్టే ఎంతటి హోరాహోరీగా సాగాయో తెలిసిపోతుంది. అయితే, మొదటి, నాలుగో సెట్ ను కోల్పోయిన ఇవాన్స్.. చివరి సెట్ లోనూ 0-4తో వెనుకబడి ఓడిపోయేలా కనిపించాడు. కానీ.. ఏకధాటిగా ఆరు పాయింట్లను బ్రేక్‌ చేసి సెట్‌ ను, మ్యాచ్‌ ను గెలుచుకున్నాడు.

అప్పట్లో ఆ ఇద్దరు 5.26 గంటలు

మూడు దశాబ్దాల కిందట పురుషుల టెన్నిస్ స్టార్లు అయిన స్టెఫాన్ ఎడ్ బర్గ్ (స్వీడన్), మైకేల్ చాంగ్ (అమెరికా). వీరి మధ్య 1992లో యూఎస్ ఓపెన్ సెమీస్ మ్యాచ్ 5 గంటల 26 నిమిషాల పాటు జరిగింది. అందులో చాంగ్ పై ఎడ్‌ బర్గ్‌ విజయం సాధించాడు. ఇప్పటివరకు ఇదే రికార్డు. 32 ఏళ్ల తర్వాత ఆ రికార్డును ఇవాన్స్‌-ఖచనోవ్ బద్దలు కొట్టారు.

కొసమెరుపు: దీనికి డబుల్ వింబుల్డన్ మ్యాచ్

ఖచనోవ్-ఇవాన్స్ మధ్య 5.35 గంటల మ్యాచ్ కే ఇంత చెప్పుకొంటున్నాం కదా..? అసలు దీనికి డబుల్ అన్నట్లు వింబుల్డన్ పోటీ జరిగింది. ఇదే టెన్నిస్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ మ్యాచ్. 2010 వింబుల్డన్‌ లో జాన్‌ ఇస్నెర్-నికోలస్ మహుత్ 11 గంటల 5 నిమిషాల పాటు తలపడ్డారు. ఇందులో ఇస్నెర్‌ గెలిచాడు.

Tags:    

Similar News