‘పంతం’ నెగ్గించుకున్న లక్నో ఫ్రాంచైజీ.. ఐపీఎల్- 18లో కెప్టెన్ అతడే

సరిగ్గా మరొక్క రెండు నెలల్లో ఐపీఎల్ 18 సీజన్ మొదలవనుండగా కెప్టెన్‌ ను ప్రకటించేసింది లక్నో.

Update: 2025-01-20 20:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో 2022లో ఎంట్రీ ఇచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. టీమ్ ఇండియా బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ సారథ్యంలో 2024 వరకు మంచి ప్రదర్శనే చేసింది. నిరుడు ముఖ్యంగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ జోష్ తో లక్నో సంచలనం రేపింది. మూడు సీజన్లలోనూ 50 శాతం అంతకుమించి విజయాలను నమోదు చేసింది లక్నో.

కెప్టెన్ మారక తప్పలేదు

నిరుటి సీజన్ వరకు లక్నో కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్.. మంచిగానే నడిపించాడు. కానీ, ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో ఓ సందర్భంలో వాదన ఏర్పడింది. వ్యాపారి అయిన సంజీవ్ గోయెంకా ఆలోచనలు ఏమిటనేది అప్పుడే అర్థమైంది. దీంతో కేఎల్ ఈ సీజన్ లో మెగా వేలానికి వచ్చాడు. రూ.14 కోట్లకు అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

మరి కెప్టెన్ ఎవరు?

రాహుల్ తప్పుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ అవసరం పడింది. ఓ దశలో నికొలస్ పూర్ వంటి విదేశీ ఆటగాళ్లకు కెప్టెన్సీ అప్పగిస్తారనే కథనాలు వచ్చాయి. కానీ, చివరకు స్వదేశీయుడినే నమ్ముకుంది. నవంబరులో జరిగిన మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధర ఇచ్చి కొనుక్కున్న టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ పగ్గాలు అప్పగించింది.

సరిగ్గా మరొక్క రెండు నెలల్లో ఐపీఎల్ 18 సీజన్ మొదలవనుండగా కెప్టెన్‌ ను ప్రకటించేసింది లక్నో. కోల్ కతాలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు సంజీవ్ గోయెంకా ప్రకటన చేశాడు. అతడితో పాటు పంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

2021, 2022, 2024 సీజన్లలో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2023లో మాత్రం రోడ్డు ప్రమాదం కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు లక్నోకు పగ్గాలు చేపట్టనున్నాడు.

కొసమెరుపు: మొత్తానికి కేఎల్ రాహుల్ తో గొడవపడిన సంజీవ్ గోయెంకా.. పంతం నెగ్గింది.

Tags:    

Similar News