చదువు, సంగీతం వదిలిన యువ మలింగకు ధోనీ హెలికాప్టర్ లిఫ్ట్

రెండేళ్ల కిందట ఐపీఎల్ సమయంలో ఓ శ్రీలంక క్రికెటర్ తన కుటుంబంతో వచ్చి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీని కలిశాడు.;

Update: 2025-04-04 19:30 GMT
చదువు, సంగీతం వదిలిన యువ మలింగకు ధోనీ హెలికాప్టర్ లిఫ్ట్

రెండేళ్ల కిందట ఐపీఎల్ సమయంలో ఓ శ్రీలంక క్రికెటర్ తన కుటుంబంతో వచ్చి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీని కలిశాడు. ధోనీకి పాదాభివందనం చేశాడు. ఆ కుర్రాడి కుటుంబం అంతా ధోనీని అత్యంత అభిమానంగా చూశారు.

ప్రపంచ క్రికెట్ లో రెండు దశాబ్దాల కిందట పెను సంచలనం.. లసిత్ మలింగ. తనదైన శైలిలో అతడు సంధించే యార్కర్లు బ్యాట్స్ మెన్ కాలిని విరిచేసినంత పనిచేసేవి. అయితే, మలింగ మళ్లీ వచ్చాడా? అన్నట్లు అతడిని తలపించే బౌలింగ్ యాక్షన్ తో వచ్చాడు ఓ కుర్రాడు... టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటపడ్డాడు.

శ్రీలంక అంటేనే మిస్టరీ బౌలర్ల ఫ్యాక్టరీ. మురళీధరన్, లసిత్ మలింగ, అజంతా మెండిస్.. వీరి కోవలోకి చెందినవాడే మతీశా పతిరన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండేళ్ల కిందట ఇతడిని చూసిన వారు అరె అచ్చం మలింగలా ఉన్నాడే? అని అనుకున్నారు.

లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న మతీశా.. 140 కిలోమీటర్లకు పైగా బంతిని వేయడమే కాదు.. కాళ్లను విరిచేసే యార్కర్లను సంధిస్తుంటాడు. ఇంతటి ప్రతిభ ఉన్న మతీశాను వెలుగులోకి తెచ్చింది మాత్రం ధోనీనే. అందుకే ధోనీ అతడికి క్రికెట్ ఫాదర్ అయిపోయాడు.

వాస్తవానికి మతీశా.. పియానో వాయించడంలో మాస్టర్. సర్టిఫికెట్ కూడా ఉంది. పాటలు కూడా పాడతాడు. శ్రీలంకలోని కాండీ నగరం వీరిది. మతీశా తల్లిదండ్రులు కూడా పాటలు పాడతారు. సంగీత కుటుంబానికి చెందిన మతీశాను పైలట్‌ గా చూడాలనేది అతడి తల్లి ఆకాంక్ష. ఇలా సంగీతం, చదువు గురించి కన్నవారు కలలు కంటుండగా మతీశా క్రికెట్ వైపు వచ్చాడు. ఏడో తరగతి వరకు క్రికెట్ గురించే తెలియనప్పటికీ ఇప్పుడు శ్రీలంక తురుపుముక్క అయ్యాడు.

బేస్ బాల్ లోకి వెళ్లినా.. అతడి బౌలింగ్ యాక్షన్ ను చూసిన సీనియర్లు క్రికెట్ వైపు పంపారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని అత్యంత ఖరీదైన ట్రినిటీ కాలేజీలో చేరాలన్న దిగ్గజ బౌలర్ చమిందా వాస్ సలహా మతీశా కెరీర్ ను మలుపుతిప్పింది. క్రీడాకారుల ఖార్కానా అయిన ఈ కాలేజీ తరఫున ఆడుతూ మతీశా టర్ఫ్ పై ఆరు వికెట్లు తీయడంతో అండర్ 19 జట్టులోకి ఎంపికయ్యాడు.

మతీశా పతిరన బౌలింగ్ శైలిని చెన్నై సూపర్ కింగ్స్ వీడియో అనలిస్ట్ లక్ష్మీనారాయణన్ గమనించి తమ మేనేజ్‌ మెంట్‌ కు తెలియజేశాడు. ఆ తర్వాత అబుదాబి టి10 టోర్నీలో పతిరన చెలరేగాడు. అలా నెట్స్‌ లో ప్రాక్టీస్‌ కోసం సీఎస్కేకు ఎంపికయ్యాడు. అతడిలోని అద్భుత ప్రతిభను గమనించిన ధోనీ.. ప్రోత్సహించాడు. అలా చెన్నై జట్టులో సభ్యుడయ్యాడు. 2022 నుంచి ఆ ఫ్రాంచైజీకి ఆడుతూ ధోనీ మార్గదర్శకంలో స్టార్ అయ్యాడు. క్రికెట్ లో తనకు అన్నివిధాలా మద్దతు ఇచ్చిన ధోనీని అతడు ఫాదర్ ఫిగర్ లా భావిస్తున్నాడు.

మతీశాను చెన్నై ఈ ఏడాది రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుంది.

Tags:    

Similar News