గెలవకుండా ఉండడానికి ఆడుతున్నాడు.. ధోనీపై తమిళ హీరో విష్ణు తాండవం
కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో శుక్రవారం దారుణమైన ఓటమి అనంతరం ధోనీపై తమిళ హీరో విష్ణు విశాల్ తీవ్రంగా మండిపడ్డాడు.;

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మారు పేరు మహేంద్ర సింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక ధోనీ కేరాఫ్ అడ్రస్ చెన్నై సూపర్ కింగ్స్. కానీ, రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై పెర్మార్మెన్స్ పడిపోతోంది. గత సీజన్ లో మోస్తరు ప్రదర్శన చేసింది. ఈ సారి మాత్రం చరిత్రలోనే అత్యంత దారుణంగా ఆడుతోంది.
కెప్టెన్ రుతురాజ్ గాయంతో ఔట్.. అసలు రిటైర్ అవుతాడని అనుకున్న ధోనీ కెప్టెన్సీ చేపట్టాల్సి వచ్చింది.. మరో స్టార్ బ్యాటర్ శివమ్ దూబెకు కూడా గాయాల బెడద.. అసలు చెన్నైకి ఓ దిశ అంటూ లేదు. 17 ఏళ్ల తర్వాత చెన్నైని సొంతగడ్డపై ఓడించిన బెంగళూరు, 15 ఏళ్ల తర్వాత ఓడించిన ఢిల్లీ.. ఇంకా ప్రతి మ్యాచ్ లో దారుణ ఓటమి..
అన్నింటికి మించి ధోనీ బ్యాటింగ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జట్టుకు కీలకమైన సమయంలో దిగకుండా.. చివరలో ఎప్పుడో దిగడం.. గెలిపించలేకపోవడంతో ధోనీ ఇంకా ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో శుక్రవారం దారుణమైన ఓటమి అనంతరం ధోనీపై తమిళ హీరో విష్ణు విశాల్ తీవ్రంగా మండిపడ్డాడు.
వాస్తవానికి ధోనీ అంటే తమిళ ప్రజలకు విపరీతమైన అభిమానం. తలా (నాయకుడు) అంటూ అతడిని గుండెల్లో పెట్టుకుంటారు. ధోనీ బ్యాటింగ్ కు దిగుతుంటే స్టేడియం దద్దరిల్లేలా శబ్దాలు చేస్తుంటారు. అలాంటి ధోనీనే ఇప్పుడు జట్టుకు భారంగా మారాడంటూ విమర్శలు వస్తున్నాయి.
ఐదుసార్లు చెన్నైని చాంపియన్ గా నిలిపిన ధోనీ.. కోల్ కతాతో మ్యాచ్ లో జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఒక్క పరుగుకే వివాదాస్పద నిర్ణయానికి ఔట్ అయ్యాడు. ఇక జట్టు కూడా 103 పరుగులే చేయగలిగింది.
ఆరు మ్యాచ్ లకు గాను ఈ సీజన్ లో ఐదో ఓటమిని మూటగట్టుకుంది. జట్టు కనీసం స్కోరు చేయలేకపోతున్న స్థితిలో
ధోని 9వ స్థానంలో వచ్చి ఒక్క పరుగే చేసి ఔటయ్యాడు. దీంతో
చెన్నై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మామూలు అభిమానుల సంగతి ఏమో కానీ.. ధోనీపై తమిళ హీరో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం హీరో అయిన విష్ణు విశాల్.. స్వయంగా క్రికెటర్. కోల్ కతాతో మ్యాచ్ అనంతరం అతడు స్పందిస్తూ ధోనీని చెడుగుడు ఆడాడు. తానొక క్రికెటర్ ను కాబట్టి తనను తాను చాలా నియంత్రించుకుంటున్నట్లు చెప్పాడు. అంత త్వరగా ఒక నిర్ణయానికి రాని తాను.. మ్యాచ్ ను చూసి తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందన్నాడు. ఇది మరీ అరాచకం అని.. బ్యాటింగ్ ఆర్డర్లో మరీ అంత కిందన రావడం ఎందుకని నిలదీశాడు. ’’గెలవకుండా ఉండడానికి ఆడడం ఏ ఆటలోనైనా చూస్తామా? సర్కస్ కు వస్తున్నట్లు అనిపిస్తోంది. ఆట కంటే ఏ ఆటగాడూ ఎక్కువ కాదు’’ అంటూ విష్ణు విశాల్ ట్వీట్ చేశాడు. అయితే, ఎక్కడా ధోనీ పేరును ప్రస్తావించలేదు. కానీ, ఈ వ్యాఖ్యలు ధోనీని ఉద్దేశించి చేశాడన్నది స్పష్టమైంది. ఈ ట్వీట్ ను కొందరు తప్పుపడుతున్నా.. సమర్థిస్తున్న వారూ ఉన్నారు.