రాజస్థాన్ వర్సెస్ గుజరాత్... అచ్చొచ్చిన స్టేడియంలో ఆర్.ఆర్.ని ఆపగలరా?
జైపూర్ పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం చాలా పెద్దది కావడంతో ఇక్కడ ఎక్కువ స్కోర్లు సాధించడం చాలా అరుదనే చెప్పాలి!
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 24 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ముస్తాబైంది. ఇక ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ ల్లో ఓటమి ఎరుగని రాజస్థాన్ రాయల్స్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ 5 మ్యాచ్ లలో 3 ఓడిపోయి 7వ స్థానంలో ఉంది.
ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్.. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండింటిలోనూ సమతూకమైన లైనప్ ను ప్రదర్శిస్తుంది. రాజస్థాన్ బ్యాటర్స్ లో యశస్వి జైస్వాల్ ఇంకా తన పూర్తిగా సెట్ కావాల్సి ఉంది. చివరి గేమ్ లో జోస్ బట్లర్ తన ఫామ్ ను ప్రదర్శించాడు.
ఇక బౌలింగ్ డిపార్ట్ మెంట్ విషయానికొస్తే... ట్రెంట్ బౌల్ట్ ప్రతి మ్యాచ్ లోనూ నిలకడగా వికెట్లు తీయడంతో రాయల్స్ బౌలింగ్ అటాక్ అద్భుతంగా ఉంది. ఇదే సమయంలో... రవిచంద్రన్ అశ్విన్ - యుజ్వేంద్ర చాహల్ ల స్పిన్ ద్వయం అత్యుత్తమంగా ఉంది. వారిద్దరూ పొదుపుగా ఉండటమే కాకుండా మ్యాచ్ లలో కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు.
ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే... పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన వరుస పరాజయాలతో జట్టు నైతిక స్థైర్యం కాస్త దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పటివరకూ గుజరాత్ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ కేవలం రెండు విజయాలను మాత్రమే నమోదు చేయగా.. బ్యాటింగ్ విభాగంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
శుభ్ మాన్ గిల్ పై గణనీయమైన ఒత్తిడి ఉంటుంది. పూర్తిగా టాప్ ఆర్డర్ పై ఆధారపడుతోంది. ఇక మిల్లర్ లేకపోవడంతో వారి మిడిల్ ఆర్డర్ కాస్త వీక్ అయ్యింది. బౌలింగ్ డిపార్ట్ మెంట్ లో ఉమేష్ యాదవ్ నుంచి మంచి ఆరంభం ఉన్నప్పటికీ... స్పిన్నర్లు దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్ లో గెలవడం గుజరాత్ కు చాలా ముఖ్యమనే చెప్పాలి!
హెడ్-టు-హెడ్ రికార్డ్ లు!:
రాజస్థాన్, గుజరాత్ లు ఇప్పటి వరకు 5 ఐపీఎల్ మ్యాచ్ లలో తలపడ్డాయి. వీటిలో రాజస్థాన్ రాయల్స్ ఒక్క మ్యాచ్ గెలవగా.. గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక గుజరాత్ పై ఇప్పటివరకు రాజస్థాన్ అత్యధిక స్కోరు 188 కాగా... రాజస్థాన్ పై గుజరాత్ అత్యధిక స్కోరు 192.
పిచ్ రిపోర్ట్:
జైపూర్ పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం చాలా పెద్దది కావడంతో ఇక్కడ ఎక్కువ స్కోర్లు సాధించడం చాలా అరుదనే చెప్పాలి! ప్రారంభంలో ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ప్రయోజనం కలిగిస్తుండటంతో.. టాస్ గెలిచే జట్లు తొలుత బౌలింగ్ ఎంచుకుంటాయి. ఇదే సమయంలో... బౌండరీలు పెద్దవి కావడంతో తర్వాత స్పిన్నర్లు కూడా కీలకపాత్ర పోషిస్తారు.
ఇక ఈ మైదానంలో పేసర్లు ఇప్పటి వరకు 357 వికెట్లు తీయగా, స్పిన్నర్లు 182 వికెట్లు పడగొట్టారు. ఇక్కడ సగటు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 161 గా ఉంది. ఈ స్టేడియంలో ఆడిన 54 మ్యాచ్ లలో రాజస్థాన్ 39 గెలిచింది.