అశ్విన్ రిటైర్మెంట్ వెనుక కథపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!
భారత్ కు ఆస్ట్రేలియాతో బోర్డార్ – గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోతుంది
భారత్ కు ఆస్ట్రేలియాతో బోర్డార్ – గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించారు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. దీంతో... అశ్విన్ తండ్రితో పాటు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్ తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అశ్విన్ ఇలా అకస్మాత్తుగా ఆటకు వీడ్కోలు చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయని.. అవి అతనికే తెలుసని.. బహుశా అవమానాలే అని అన్నారు.
ఇదే సమయంలో... అతడు రిటైర్ కావడం అందరికీ షాక్ లా ఉందని.. అతడి బుర్రలో ఏ ఆలోచనలు తిరుగుతున్నాయో.. మాకు కూడా ఆలస్యంగా చెప్పాడు అంటూ అశ్విన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో... అసలు ఏమి జరిగి ఉంటుందనే చర్చ బలంగా నడించింది. ఈ నేపథ్యంలో తన తండ్రి వ్యాఖ్యలను కాస్త కవర్ చేసే ప్రయత్నం చేశాడు అశ్విన్ అని అంటున్నారు.
తన తండ్రి సంచలన వ్యాఖ్యల అనంతరం స్పందించిన అశ్విన్... మీడియాతో ఎలా మాట్లాడాతో తన తండ్రికి పెద్దగా తెలియదని.. ఆయన వ్యాఖ్యలను మీరు తీవ్రంగా పరిగణించొద్దని.. దయచేసి క్షమించి ఆయనను వదిలేయాలని.. ఇబ్బంది పెట్టవద్దని మీడియాను కోరాడు అశ్విన్!
కపిల్ కీలక వ్యాఖ్యలు!:
అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు. అశ్విన్ నిర్ణయం తనను షాక్ కి గురి చేసిందని.. అభిమానులకు నిరాశ కలిగించిందని.. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన అశ్విన్ ముఖంలో ఆవేదన తాలూకు ఛాయ కనిపించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అతడు మరికొన్ని రోజులు వేచి ఉండి, భారత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు. కానీ.. అశ్విన్ ఇప్పుడే ఎందుకు ఇలా చేశాడో అర్ధం కావడం లేదు అని చెప్పిన కపిల్... ఈ నిర్ణయం వెనుకున్న ఆయన కథను వినాలని ఉందని.. అతనికి గౌరవం ఇవ్వాలని.. ఈ మ్యాచ్ విన్నర్ కి బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలని కపిల్ తెలిపారు.