నా 'పంతం'.. డబ్బు కోసం కాదు.. టీమ్ ఇండియా స్టార్

ఇటీవల విడుదలైన ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం..

Update: 2024-11-19 20:30 GMT

ఇటీవల విడుదలైన ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం.. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ ఒకరిని రిటైన్ చేసుకోకపోవడం.. వికెట్ కీపర్ బ్యాటర్ గా, మరీ ముఖ్యంగా టి20ల్లో విధ్వంసక ఆటగాడిగా ఉన్న అతడు ఆ ఫ్రాంచైజీ కెప్టెన్ కూడా. అలాంటివాడిని ఎందుకు రిటైన్ చేసుకోలేదో? అన్న సందేహం అభిమానులను బాగా వేధించింది. అయితే, దీనివెనుక డబ్బే కారణం అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చివరకు దీనిపై ఆ క్రికెటర్ స్పందించాడు.

వేలం ముగింట కలకలం

టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ భవిష్యత్ లో కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్నవాడు రిషభ్ పంత్. 27 ఏళ్ల పంత్ ను దాదాపు 8 ఏళ్లుగా టీమ్ ఇండియాలో సభ్యుడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్నాడు. కెప్టెన్ కూడా. పైగా ఈ ఏడాది సీజన్ లో అతడు కారు ప్రమాదం నుంచి కోలుకుని మరీ ఐపీఎల్ లోకి వచ్చాడు. మంచి ఆటతీరు కనబర్చాడు కూడా. అలాంటి పంత్ ను రిటైన్ చేసుకోలేదు ఢిల్లీ. దీంతో ఏదో జరిగిందనే అనుమానాలు కలిగాయి. వచ్చే ఆది, సోమవారాల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో మెగా వేలం నిర్వహించనున్న సందర్భంలో పంత్ ను ఎందుకు కాదనుకున్నారో అతడే స్పందించాడు. తాను కేవలం డబ్బు కారణంగా రిటైన్ అవలేదనే ఆరోపణలను ఖండించాడు.

మెగా వేలంలో రేటెంతో..?

పంత్ కోసం పంజాబ్ కింగ్స్, సీఎస్కే, ఆర్సీబీ వేచి చూస్తున్నాయి. మెగా వేలంలో అందరి దృష్టి అతడిపైనే ఉంది. రూ.25 కోట్లను మంచి అత్యధిక ధర దక్కుతుందని కూడా అంటున్నారు. అయితే, భారత దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్ స్పందిస్తూ పంత్‌ ను ఢిల్లీ ఎందుకు రిటైన్‌ చేసుకోలేదో చెప్పుకొచ్చాడు. బహుశా రిటెన్షన్ ఫీజులో విషయంలో ఫ్రాంఛైజీతో విభేదించి ఉండొచ్చన్నాడు. అయితే, పంత్ సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించాడు. ఢిల్లీని వీడడానికి డబ్బుతో సంబంధం లేదన్నాడు. ‘నా రిటెన్షన్ డబ్బుతో ముడిపడలేదని కచ్చితంగా చెప్పగలను’ అంటూ గావస్కర్‌ వీడియోకు పంత్ ట్వీట్ చేశాడు.

మళ్లీ ఢిల్లీకేనా?

కాగా, పంత్‌ను ఢిల్లీ తిరిగి దక్కించుకుంటుందని కూడా గావస్కర్ పేర్కొన్నాడు. ఢిల్లీకి కెప్టెన్ కావాల్సినందున పంత్ నే తీసుకుంటుందన్నాడు. అతడు లేకుంటే కొత్త కెప్టెన్ కోసం వెదకాల్సి వస్తుందని.. కాబట్టి మెగా వేలంలో పంత్ ను ఢిల్లీ దక్కించుకుంటుందని విశ్లేషించాడు.

Tags:    

Similar News