27 కోట్లు.. 40 పరుగులు.. ఐపీఎల్ లో పీఆర్ ఉంటే చాలా? ఆట అవసరం లేదా?

Update: 2025-04-14 06:30 GMT
27 కోట్లు.. 40 పరుగులు.. ఐపీఎల్ లో పీఆర్ ఉంటే చాలా? ఆట అవసరం లేదా?

21(18), 2(6), 2(5), 15(15), 0(6).. మొత్తం కలిపితే 40 పరుగులు.. వీటిలో టాప్ స్కోర్ అయిన 21 పరుగులు చేసిన మ్యాచ్ లోనూ రెండు లైఫ్ లు. ఇతర మ్యాచ్ లలో చేసిన బంతికో పరుగు ఒకదాంట్లో, మిగతావాటిలో పరుగులను మించి బంతులు మింగేశాడు. పోనీ, ఇదేమైనా టెస్టు క్రికెట్టా? అంటే కాదు.. ధనాధన్ ఐపీఎల్. రూ.27 కోట్లు పోసి.. పక్క జట్టు నుంచి తెచ్చకుని మరీ కెప్టెన్ ను చేసిన ఆటగాడి పెర్మార్మెన్స్ ఇది.

ఆడింది ఐదు మ్యాచ్ లు.. ఒక్కదాంట్లోనూ ఇంపాక్ట్ లేదు.. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ గా అయినా పనికొచ్చేంత ఆట లేదు.. అతడేమైనా బౌలరా ? అంటే అదీ కాదు.. నిఖార్సయిన టి20 బ్యాటర్ అని గొప్ప పేరు. ఈసారి ఆట చూస్తే మాత్రం అధ్వానం.

పైన చెప్పుకొన్నదంతా టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి అని తెలిసిపోతోంది కదా?. ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ పంత్. ఢిల్లీ కెప్టెన్ గా ఉన్న అతడిని మెగా వేలంలో ఐపీఎల్ రికార్డు ధర రూ.27 కోట్లు పెట్టి తెచ్చుకుంది లక్నో.

పంత్ ఈ సీజన్ లో చేసింది మాత్రం 40 పరుగులు. బ్యాట్ తో ఫామ్ లో లేడని సరిపెట్టుకున్నా.. వికెట్ల వెనుక కూడా అతడిది దారుణమైన ప్రదర్శన.

గుజరాత్ టైటాన్స్ తో శనివారం మ్యాచ్ లో ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోవడంతో పంత్ ఓపెనింగ్ కు దిగాడు. రెండు క్యాచ్ డ్రాప్ లతో లైఫ్ లు పొందిన అతడు 18 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు. ఒకప్పుడు పంత్ క్రీజులో ఉంటే జట్టు గెలుస్తుందని అనుకునేవారు. ఇప్పడు అతడు బ్యాటింగ్ చేస్తుంటే వారి జట్టు ఓటమి ఖాయం అనిపిస్తోంది. గుజరాత్ మ్యాచ్ లో నికొలస్ పూరన్ దూకుడు, ఆయుష్ బదోనీ స్థిరంగా ఆడడంతో లక్నో గెలిచింది. లేదంటే ఓడిపోయేదే.

ఇక పంత్ విషయానికి వస్తే అతడి పీఆర్ (పర్సనల్ రిలేషన్) టీమ్ హైప్, మాజీ క్రికెటర్ల పొగడ్తలతో లక్నో రూ.27 కోట్లు పెట్టిందా? అని అనిపిస్తోంది. గొప్ప ఫామ్ లో లేకున్నా పీఆర్ ఫ్యాక్టరీ మాయతోనే అంత ధర పలికాడా? అనే అనుమానాలు వస్తున్నాయి.

వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ లో పంత్ నిర్లక్ష్య ఆటను చూసిన సునీల్ గావస్కర్ వంటి దిగ్గజం స్టుపిడ్ అంటూ తిట్టాడు. ఆపై చాంపియన్స్ ట్రోఫీలో పంత్ ను కాదని కేఎల్ రాహుల్ కు వికెట్ కీపింగ్ అప్పగించారు. ఇప్పుడు పంత్ ఐపీఎల్ లోనూ ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. బహుశా 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం తాలూకూ గాయాలు పంత్ కెరీర్ ను దెబ్బతీస్తున్నాయా? అనిపిస్తోంది.

కొసమెరుపు: టీమ్ ఇండియా సెలక్టర్లూ.. చూస్తున్నారా? ఔను.. నిరుడు రాహుల్ ను మైదానంలోనే తిట్టిన లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఫేస్ లో ఇప్పుడు ఎక్స్ ప్రెషన్స్ ఏమిటో?

Tags:    

Similar News