వచ్చేస్తున్నాడు టీమిండియా "ఎక్స్" ఫ్యాక్టర్.. పంతం నెగ్గాడు
14 నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్న పంత్.. కోలుకునే ప్రయత్నం చేశాడు. విదేశాల్లో సర్జరీ చేయించుకున్నాడు.
స్వదేశంలో టెస్టులు గెలవడం కాదు.. విదేశాల్లో గెలవాలి.. ఇంగ్లండ్ ను వారి దేశంలో చితక్కొట్టాలి.. ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే కంగారు పెట్టాలి. దక్షిణాఫ్రికాను దడదడలాడించాలి.. ఇద్దరు ముగ్గురు సీనియర్లు రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో వారి స్థానాన్ని భర్తీ చేయగల దమ్మున్న ఆటగాడు టీమిండియాకు కావాలి. ఇప్పటివరకు ఉన్నవారిలో ప్రతిభ లేదని కాదు.. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చగల అతడు మాత్రం "స్పెషల్ టాలెంట్". అందుకే"ఎక్స్" ఫ్యాక్టర్ అని పిలిచేవారు.
ఫలితాన్ని మార్చగల దమ్ము
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఫిట్ నెస్ సాధించాడు. 2022 డిసెంబరు 30న తల్లిని ఆశ్చర్యపరుద్దామని ఎస్ యూవీలో ఢిల్లీ నుంచి బయల్దేరి అనూహ్యంగా ప్రమాదంలో చిక్కుకున్న పంత్.. ఇన్నాళ్లూ మైదానానికి దూరమయ్యాడు. నిజానికి నాటి ప్రమాదంలో పంత్ ప్రాణాలతో గట్టెక్కాడంటే ఆశ్చర్యమే. క్షణాల్లో కాలి బూడిదైన కారు నుంచి పంత్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. లేదంటే మహా విషాదమే. అయితే, ప్రాణాలు దక్కినా మెకాలు, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అప్పటినుంచి అతడు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు.
14 నెలల తర్వాత
14 నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్న పంత్.. కోలుకునే ప్రయత్నం చేశాడు. విదేశాల్లో సర్జరీ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంచాడు. ఇక కొన్నాళ్లుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణ ఉన్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. పంత్ గురించి ఈ నెల 5న అప్ డేట్ ఇస్తామని బీసీసీఐ తెలిపింది. అయితే వారం ఆలస్యం అయినా శుభవార్త వెల్లడించింది.
కీలక టోర్నీలకు దూరం
గత ఐపీఎల్ సీజన్ తో పాటు టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్, వన్డే ప్రపంచ కప్ వంటి కీలక టోర్నీలకు దూరమయ్యాడు పంత్. ఆ ప్రభావం జట్టుపై బాగానే పడింది. ఈ సమయంలో కేఎస్ భరత్, జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్ వంటివారికి చాన్సులు దక్కాయి. కేఎల్ రాహుల్ పూర్తిస్థాయి కీపర్ గా అవతారమెత్తాడు. మంచి జోరు మీద ఉన్న పంత్ గనుక ఉండి ఉంటే వన్డే ప్రపంచ కప్ దక్కేదమో? కాగా, పంత్ మళ్లీ ఎప్పుడు బరిలో దిగుతాడు? ఐపీఎల్ ఆడతాడా? అనే ప్రశ్నలకు తెరదించుతూ బీసీసీఐ ప్రకటన వెలువరించింది.
వికెట్ కీపింగ్ కూడా..
పంత్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్. కానీ, మోకాలుకు గాయం కావడంతో కీపింగ్ సంగతి ఏమిటి? అనే ప్రశ్న వచ్చింది. అయితే, ఐపీఎల్- 2024 సీజన్ కు పంత్ బ్యాటర్, కీపర్‌గా పూర్తి ఫిట్ అని బీసీసీఐ ప్రకటించింది. త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరనున్నట్లు తెలిపింది. మరోవైపు పంత్ ఐపీఎల్ ఆడితే టి20 ప్రపంచ కప్ నకూ అతడి ఎంపికను పరిగణిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. అంటే.. కేఎల్ రాహుల్, జితేశ్ శర్మ, ఇషాన్ కిషన్ లకు మరింత పోటీనే అన్నమాట.