గుజరాత్ కు మరో కష్టం.. 3.60 కోట్ల ఆటగాడికి రోడ్డు ప్రమాదం
జార్ఖండ్ అంటే మనకు ధోని గుర్తొస్తాడు. లేదంటే ఇషాన్ గురించి చెప్పుకొంటాం. వీరిద్దరూ వికెట్ కీపర్ బ్యాటర్లే. వారిలాంటివాడే జార్ఖండ్ కు చెందిన రాబిన్ మింజ్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే విజేతగా నిలిచి.. రెండో సీజన్ లో ఫైనల్ చేరి.. త్రుటిలో కప్ ను చేజార్చుకుంది గుజరాత్ టైటాన్స్. హార్దిక్ పాండ్యా నాయకత్వం.. శుబ్ మన్ గిల్ ఫామ్, డేవిడ్ మిల్లర్ దూకుడైన ఫినిషింగ్, మొహమ్మద్ షమీ బౌలింగ్ , సాయి సుదర్శన్ వంటి యువ బ్యాట్స్ మన్ మెరుపులతో గుజరాత్ టైటాన్స్ గట్టి జట్టుగా నిలిచింది. వరుసగా రెండు సీజన్లలోనూ ఫైనల్ కు చేరడం అంటే మాటలు కాదు. అయితే, ఈసారి గుజరాత్ పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వెళ్లిపోయాడు. గిల్ ఫామ్ గొప్పగా ఏమీ లేదు. అన్నిటికి మించి షమీ ఏకంగా మోకాలికి శస్త్రచికిత్సతో లీగ్ మొత్తానికే దూరమయ్యాడు. వన్డే ప్రపంచ కప్ లో అత్యద్భుత ప్రదర్శన చేసిన షమీ.. ఆ తర్వాత మైదానంలోకే దిగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గిల్ కెప్టెన్ గా కొత్త సీజన్ మొదలుపెట్టబోతోంది గుజరాత్.
20 రోజుల్లొ లీగ్.. అనుకోని ఘటన మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. వాస్తవానికి నిరుటి సీజన్ చాంపియన్, రన్నరప్ మధ్య మ్యాచ్ జరగాలి. కానీ, ఈసారి అదేమీ లేనట్లుంది. ఇక గుజరాత్ మరోసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. అయితే, ఇప్పటికే షమీ దూరమైన స్థితిలో ఉండగా .. ఆ జట్టుకు చెందిన ఆటగాడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఐపీఎల్ మినీ వేలంలో అతడిని గుజరాత్ రూ.3.60 కోట్లకు దక్కించుకుంది.
ఎవరా ఆటగాడు..?
జార్ఖండ్ అంటే మనకు ధోని గుర్తొస్తాడు. లేదంటే ఇషాన్ గురించి చెప్పుకొంటాం. వీరిద్దరూ వికెట్ కీపర్ బ్యాటర్లే. వారిలాంటివాడే జార్ఖండ్ కు చెందిన రాబిన్ మింజ్. ఈ కుర్రాడిని గుజరాత్ రూ.3.60 కోట్లకు కొనుక్కుంది. వేలం సందర్భంగా ఇతడికి పలికిన ధర తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ పై వెళ్తుండగా మరో వాహనం ఢీకొనడంతో గాయాలపాలయ్యాడు. అయితే, దెబ్బలు పెద్దగా తగల్లేదని తెలిసింది. మింజ్ మోకాలికి గాయాలైనట్లు తెలిసింది. కాగా, మింజ్ ది జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా.
తొలి గిరిజన క్రికెటర్ మింజ్ మరో ప్రత్యేకత ఏమంటే.. ఐపీఎల్ లో ఆడనున్న తొలి గిరిజన క్రికెటర్. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ లాగానే ఎడమచేతి వాటం క్రికెటర్. దేశవాళి టోర్నీల్లో దూకుడుగా ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. మరో విశేషం ఏమంటే.. ధోనీకి కెరీర్ మొదట్లో శిక్షణ ఇచ్చిన చంచల్ భట్టాచార్య దగ్గరే మింజ్ కూడా శిక్షణ పొందుతున్నాడు. వాస్తవానికి గత ఏడాది వేలంలో రాబిన్ ను ఏ జట్టూ తీసుకోలేదు. ఈసారి ముంబై, లక్నో, ఢిల్లీ, కోల్ కతా పోటీపడ్డాయి. చివరకు గుజరాత్ భారీ ధరకు దక్కించుకుంది.
కొసమెరుపు:.. అనేక ప్రత్యేకతల నడుమ రాబిన్ మింజ్ కు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఇచ్చిన ప్రశంస ఏమంటే.. ‘‘రాబిన్ మింజ్ ఎడమ చేతి వాటం పోలార్డ్’’ అని.