ఐపీఎల్ మెగా వేలం..పెను సంచలనం..సూపర్'హిట్ మ్యాన్' నో రిటైన్

వచ్చే సీజన్ కు ముందు ఫ్రాంచైజీల ముందు ఉన్న పెద్ద సమస్య రిటెన్షన్.

Update: 2024-09-24 11:30 GMT

అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్ కు భారీ మార్పులతో రానుందా..? స్టార్ క్రికెటర్లే కాదు.. స్టార్ కెప్టెన్లు/ మాజీ కెప్టెన్లు కూడా లీగ్ లో ఈసారి రిటైన్ కాకుండా పోనున్నారా? జట్లలో సమూల మార్పులు తప్పవా..? ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి? రైట్ టు మ్యాచ్ రూల్స్ ఏమిటి? అనేది ఖరారు కాకున్నా.. ఊహాగానాలకు మాత్రం తక్కువేం లేదు. ఇప్పుడు మరో సంచలన కథనం బయటకు వచ్చింది.

ఐదుగురా? ఆరుగురా?

వచ్చే సీజన్ కు ముందు ఫ్రాంచైజీల ముందు ఉన్న పెద్ద సమస్య రిటెన్షన్. ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలి? అనేది ఫ్రాంచైజీలకూ అంతుపట్టడం లేదు. ఇప్పటికే ఒక్కోటి ఒక్కో విధంగా ఆప్షన్స్ చెప్పాయి. అయితే, ఐదుగురిని రిటైన్‌ చేసుకొనేలా పలు ఫ్రాంఛైజీలు జాబితాలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

సూపర్ ‘హిట్ మ్యాన్’ ఔట్

ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ.. రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్.. ఆ ఫ్రాంచైజీ ఐదు టైటిళ్లు గెలవడంలో రోహిత్ పాత్ర మరువలేనిది. అలాంటిది ఈ ఏడాది అతడిని తప్పించి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకుంది ముంబై. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయితే, అత్యంత విజయవంతమైన తమ మాజీ కెప్టెన్, ఆటగాడిని ముంబై ఈసారి వదిలేస్తుందనే టాక్ నడుస్తోంది. ఇంకొన్ని జట్లూ స్టార్ లను వదిలేస్తాయనే ప్రచారం జరుగుతోంది.

వేలం నవంబరు రెండో వారంలోనే..

ఐపీఎల్ వేలం డిసెంబరులో అని మొన్నటివరకు అనుకున్నారు. కానీ, నవంబరు రెండో వారంలోనే అని తెలుస్తోంది. ఇందులో ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ వేరే ఫ్రాంచైజీకి మారతాడని తెలుస్తోంది. ముంబైనే రోహిత్ ను వదిలేస్తుందని సమాచారం. ఇతడే కాదు.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు, ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకాకు టర్మ్స్ సరిగా లేవు. ఇప్పుడు రాహుల్ ఆ జట్టును వీడి.. సొంత రాష్ట్రం కర్ణాటకకు చెందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు వెళ్లే చాన్సుందని చెబుతున్నారు. లక్నో నే రాహుల్ ను వదిలేస్తుందని ప్రచారం. కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన దగ్గరనుంచి బెంగళూరును నడిపిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్‌ కు కూడా వయసు 40 కి చేరింది. ఇతడిని తప్పించి వేరొకరికి (బహుశా రాహుల్ కు) కెప్టెన్సీ ఇచ్చే చాన్సుంది.

గత సీజన్‌ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించి ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌.. ‘ఐదుగురి’ రిటైన్‌ నిబంధనతో ఆ జట్టుకు దూరం కానున్నాడు. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్, ఆల్ రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రి రస్సెల్, రింకూ సింగ్‌ తో పాటు ఫిల్‌ సాల్ట్‌, మిచెల్‌ స్టార్క్‌.. ఇలా కోల్ కతా నిండా స్టార్లే ఉండడం అయ్యర్ అవకాశాలను దెబ్బతీసింది. అయితే, వేలంలో మళ్లీ దక్కించుకొనే చాన్స్ లేకపోలేదు.

అట్టర్ ఫ్లాప్ అల్లుడు

ఈ ఏడాది లీగ్ లో అత్యంత దారుణంగా విఫలమై బెంగళూరు అవకాశాలను దెబ్బతీశాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్. రూ.14.25 కోట్లు పెట్టి కొన్న బెంగళూరుకు తన బొప్పి కట్టించాడు. మధ్యలోనే మానసిక ఆరోగ్యం బాగోలేదంటూ తప్పుకొన్నాడు. ఈసారి బెంగళూరు మ్యాక్స్ వెల్ ను వదిలేస్తుందని అందరూ ఊహించిందే.

వార్నర్ ఐపీఎల్ లోనే..

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు నేరుగా ఐపీఎల్ లో కనిపించనున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్ క్యాపిటల్స్ కు మారిన వార్నర్ ఫామ్ గొప్పగా ఏమీ లేదు. ఢిల్లీ ఈ సారి వదిలేసుకోవడం ఖాయమే. వయసు పైబడినా ఒకవేళ వార్నర్ మెగా వేలంలోకి వస్తే మంచి ధరే దక్కొచ్చేమో?

Tags:    

Similar News