హైదరాబాదీ అజహర్ చెత్త రికార్డును బద్దలుకొట్టిన ‘కెప్టెన్’ రోహిత్
కానీ, ఇప్పుడు ఎవరూ కోరుకోని చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
దాదాపు కెరీర్ చివరి దశలో టీమ్ ఇండియాకు కెప్టెన్ అయ్యాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఎంతో ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్ గా పేరున్న రోహిత్.. ఓ దశలో జట్టులో చోటే దొరకని పరిస్థితి నుంచి ప్రపంచ టాప్ ఆటగాడిగా ఎదిగాడు. అయితే, వన్డేలు, టి20ల్లో అతడి గొప్పదనాన్ని ఎవరూ కాదనలేరు. కానీ,టెస్టుల్లో మాత్రం సాధారణ బ్యాట్స్ మనే. మూడు-నాలుగేళ్ల కిందటి వరకు టెస్టుల్లో సభ్యుడే కాదు. కానీ, కాలం కలిసిరావడంతో సంప్రదాయ ఫార్మాట్ టీమ్ లోనూ చోటు దక్కించుకున్నాడు. ఆపై కెప్టెన్ కూడా అయ్యాడు. కానీ, ఇప్పుడు ఎవరూ కోరుకోని చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అరుదైన వైట్ వాష్..
టెస్టు క్రికెట్ లో వైట్ వాష్ అంటే అవమానకరమే. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ ప్రత్యర్థికి తలొగ్గడం అంటే.. అత్యంత బలహీన జట్లకు మాత్రమే ఆ పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో సిరీస్ లో టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ నకు గురైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల చేతిలో కాకుండా న్యూజిలాండ్ తో ఇలాంటి పరాజయం ఊహించనిదే. అంతేకాదు.. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మూడు మ్యాచ్ ల సిరీస్ లో వైట్ వాష్ కావడం ఇదే మొదటిసారి.
అప్పట్లో 0-2.. ఇప్పుడు 0-3
36 ఏళ్ల తర్వాత భారత్ లో తొలిసారి టెస్టు గెలిచిన న్యూజిలాండ్.. చరిత్రలో తొలిసారిగా టెస్టు సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్.. మూడో టెస్టులోనూ నెగ్గి తొలిసారి భారత్ లో క్లీన్ స్వీప్ రికార్డునూ సొంతం చేసుకుంది. కాగా, స్వదేశంలో టీమ్ ఇండియా ఇప్పటివరకు మూడు సార్లు క్లీన్ స్వీప్ అయింది. 1980, 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా 0-3తో చేతులెత్తేసింది. 2012లో స్వదేశంలో చివరిసారిగా టెస్టు సిరీస్ కోల్పోయిన (ఇంగ్లాండ్) వాంఖడేలోనే ఇప్పుడు కూడా ఓడింది. ఇక 1999-2000లో దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ లో 0-2 తేడాతో చివరిసారిగా ఓడిపోయింది.
రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన టెస్ట్ ల సంఖ్య ఐదుకు చేరింది. మొత్తం 16 మ్యాచ్ లకు గాను అయిదింట్లో పరాజయం పాలైంది. అత్యధిక టెస్టుల్లో ఓడిన కెప్టెన్ గా టైగర్ నవాబ్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నారు. 27 టెస్ట్ మ్యాచ్ లలో ఆయన కెప్టెన్ గా వ్యవహరించగా 9 మ్యాచ్ లలో భారత్ పరాజయం పాలైంది. ఇక మూడో స్థానంలో మొహహ్మద్ అజహరుద్దీన్ నిలిచాడు. అతడి కెప్టెన్సీలో స్వదేశంలో 20 మ్యాచ్ లలో నాలుగింట్లో భారత్ ఓడింది. కపిల్ దేవ్- 4 (20), బిషన్ సింగ్ బేడీ- 3 (ఎనిమిది), మహేంద్ర సింగ్ ధోనీ- 3 (30), సౌరవ్ గంగూలీ- 3 (21), సచిన్ టెండుల్కర్- 3 (12) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.