టీమ్ ఇండియా స్టార్ కు టెస్టుల్లో బీసీసీఐ షాక్.. వన్డేల్లోనూ అంతే?

వన్డేల్లో రోహిత్ ను కెప్టెన్ చేయడమే కాక త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకీ పగ్గాలు అప్పగించారు.

Update: 2025-02-15 19:30 GMT

2024 జూన్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన తర్వాత టీమ్ ఇండియాకు ఏదీ పెద్దగా కలిసిరాలేదు. జింబాబ్వే వంటి చిన్న జట్టుపై టి20 సిరీస్ లో ఒక మ్యాచ్ ఓడి మిగతా 4 మ్యాచ్ లు గెలిచింది. ఆ వెంటనే శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓడింది. లంకకు వన్డే సిరీస్ కోల్పోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. బంగ్లాదేశ్ పై రెండు టెస్టుల సిరీస్ ను కొంత ఇబ్బందిపడినా తేలిగ్గా గెలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ పై మూడు టెస్టుల సిరీస్ ను అదీ స్వదేశంలో 0-3తో కోల్పోయింది. ఆస్ట్రేలియా టూర్ లో తొలి టెస్టు గెలిచినా మూడు ఓడింది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. దీంతోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ పై, నాయకత్వంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాగా, కొత్త ఏడాదిలో ఇంగ్లండ్ పై టి20, వన్డే సిరీస్ లను నెగ్గింది. వన్డేల్లో రోహిత్ ను కెప్టెన్ చేయడమే కాక త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకీ పగ్గాలు అప్పగించారు.

అవే ఆఖరు..

టి20లు, వన్డేల్లో సూపర్ బ్యాట్స్ మన్ అయినప్పటికీ టెస్టుల్లో మొదటినుంచి రోహిత్ ది సాధారణ ప్రదర్శనే. 2018 నుంచి మాత్రమే అతడు రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. అయితే, ఏడాది నుంచి సంప్రదాయ ఫార్మాట్ లో అతడి ఫామ్ ఏమీ బాగోలేదు. దీంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో చివరి మ్యాచ్ కు దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రోహిత్ ను ఇక టెస్టుల్లో చూడడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తమైంది.

తాజాగా బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం రోహిత్ టెస్టుల్లో ఆడడం ఇక కష్టమే. వచ్చే టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ కు స్టార్ పేసర్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. అయితే, టీమ్ ఇండియా జూన్ వరకు టెస్టులు లేవు. అప్పటికి కొత్త కెప్టెన్ అవుతాడని చెబుతున్నారు.

మరి బుమ్రా గాయం సంగతి ఏమిటనేదేగా ప్రశ్న..? బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదని, ముందుజాగ్రత్తగానే అతడిని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపారని సమాచారం.

ఇక చాంపియన్స్ ట్రోఫీలో గనుక భారత నెగ్గకుంటే రోహిత్ శర్మ వన్డే కెరీర్ కూడా ముగిసినట్లేనని భావించాలి. 2024లో టి20 ప్రపంచ కప్ నెగ్గాక రోహిత్ టి20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News