టి20ల్లో లాగే టెస్టుల్లోనూ ఆ దిగ్గజాలు ఒకేసారి రిటైర్?

గత ఏడాది జూన్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకున్న అనంతరం స్టార్ బ్యాట్స్ మెన్ ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు.

Update: 2025-01-03 10:20 GMT

గత ఏడాది జూన్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకున్న అనంతరం స్టార్ బ్యాట్స్ మెన్ ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. మరోవైపు అప్పటి నుంచి ఆ ఇద్దరు స్టార్లు సరిగా రాణించిందే లేదు. వారిద్దరూ జట్టులో ఉండగానే భారత్ ఎన్నడూ లేనివిధంగా స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో చిత్తయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన వారు కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. మళ్లీ ఇప్పుడు వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు.

పైన చెప్పుకొన్నది టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లిల గురించి. రోహిత్ ను శుక్రవారం ప్రారంభమైన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చివరి, ఐదో టెస్టుకు పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. పేరుకు విశ్రాంతి అని చెబుతున్నారు. కానీ, ఇది వేటు వేసినట్లే లెక్క. పైగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేలా చేస్తున్నారనేది కూడా స్పష్టం అవుతోంది. ఈ సిరీస్ లో రోహిత్ మూడు టెస్టులు ఆడి 31 పరుగులే చేశాడు. ఓపెనర్‌, ఆరో స్థానంలో వచ్చినా విఫలమయ్యాడు. ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్‌ దాటాడు. దీంతో అతడిని

‘బలవంతం’గా పక్కనపెట్టారు.

16 మందిలోనూ లేడు..

రోహిత్ సిడ్నీ టెస్టుకే కాదు.. 16 మందితో కూడిన స్క్వాడ్‌ లోనూ లేడు. ఈ నేపథ్యంలో ఈ టెస్టు అనంతరం వీడ్కోలు చెబుతాడనే అనుమానాలు బలపడుతున్నాయి. అంటే.. బాక్సింగ్ డే (మెల్‌ బోర్న్‌) టెస్టే రోహిత్‌ కు చివరిదిగా మారింది. ఇక ప్రస్తుత మ్యాచ్‌ ఆరంభంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట కనిపించాడు రోహిత్. దీంతో అతడి రిటైర్మెంట్ ఖాయం అయిందంటున్నారు.

కోహ్లికూడా..

రోహిత్ తో పాటు కోహ్లి కూడా సిడ్నీ టెస్టు తర్వాత వీడ్కోలు చెబుతాడని అంటున్నారు. ప్రస్తుత సిరీస్‌ లో ఒక్క సెంచరీ మినహా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఐదో, సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌ లోనూ 17 పరుగులే చేశాడు. 5 మ్యాచ్ లలో 8 ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ 184 పరుగులే చేశాడు. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌ లోనూ రాణించకపోతే ‘రిటైర్మెంట్’ డిమాండ్లు పెరుగుతాయి.

ఒకవేళ టి20 ప్రపంచకప్ అనంతరం తరహాలోనే ఇద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ పలుకుతారా? అనేది చూడాలి. సిడ్నీ టెస్టు అనంతరం మీడియా ముందుకు వస్తారని కూడా తెలుస్తోంది. ఇంగ్లండ్‌ తో వన్డే, టి20లు, ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. రోహిత్, విరాట్ టెస్టులకే వీడ్కోలు చెబితే చాంపియన్స్ ట్రోఫీ ఆడతారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబితే ఇదే వారిద్దరికి చివరి సిరీస్‌ గా మిగిలిపోనుంది.

Tags:    

Similar News