ఆ ఇద్దరు స్టార్ బ్యాట్స్ మెన్ టెస్టు కెరీర్ ఖతం..?

విదేశాల సంగతి పక్కనపెడితే స్వదేశంలో కోహ్లి, రోహిత్ ఈ స్థాయిలో ఫెయిలవడం దారుణం. దీనికిముందు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లోనూ వీరిద్దరూ పెద్దగా రాణించలేదు.

Update: 2024-11-03 23:30 GMT

1) బంగ్లాదేశ్ తో రెండో టెస్టు.. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ 70 పరుగులు చేశాడు. మంచి టచ్ లో ఉండగా అంపైర్ ఎల్బీ ఇచ్చాడు. అది ఆ రోజు చివరి ఓవర్. రివ్యూలు కూడా చేతిలో ఉన్నాయి. కానీ, ఆ బ్యాట్స్ మన్ రివ్యూ కోరకుండానే వెళ్లిపోయాడు. తీరా చూస్తే బంతి ముందు బ్యాట్ కు తగిలినట్లు తేలింది. ఇదే బ్యాట్స్ మన్.. న్యూజిలాండ్ తో సిరీస్ లో కీలకమైన మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో రనౌట్ అయ్యాడు. టెస్టుల్లో రనౌట్ అంటే అది సూసైడ్ తో సమానం. అసలు కివీస్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ లో అతడు చేసిన పరుగులు 93 మాత్రమే.

2) ఇక మరో బ్యాట్స్ మన్.. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో విఫలమయ్యాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో ఒక్క అర్థ సెంచరీ మాత్రమే చేశాడు. అసలు ఈ సిరీస్ లో స్పిన్నర్లు ఆధిపత్యం వహిస్తుంటే ఈ బ్యాట్స్ మన్ మాత్రం పేసర్ల బౌలింగ్ లో ఔటయ్యాడు. చివరికి వైట్ వాష్ తప్పించుకోవాల్సిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ పుల్ షాట్ ఆడి పేసర్ కే వికెట్ ఇచ్చాడు.

పైన చెప్పుకొన్న వాటిలో మొదటి ఉదాహరణ విరాట్ కోహ్లిది అయితే రెండోది కెప్టెన్ రోహిత్ శర్మది. న్యూజిలాండ్ తో సిరీస్ లో మూడు మ్యాచ్ లకు గాను రోహిత్ 91 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్ ల సగటు 15.17. ఇక కోహ్లి కూడా ఇంతే.. 15.50 సగటుతో 93 పరుగులు చేశాడు. ఓ సిరీస్ లో వీరిద్దరి అత్యంత దారుణ ప్రదర్శన ఇదే కావడం గమనార్హం.

ఇక కష్టమే..

విదేశాల సంగతి పక్కనపెడితే స్వదేశంలో కోహ్లి, రోహిత్ ఈ స్థాయిలో ఫెయిలవడం దారుణం. దీనికిముందు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లోనూ వీరిద్దరూ పెద్దగా రాణించలేదు. తాజా కివీస్ సిరీస్ లో కోహ్లి స్పిన్నర్లకు నాలుగు సార్లు వికెట్ ఇచ్చాడు. పేసర్ కు ఒకసారి, మరోసారి రనౌట్ అయ్యాడు. రోహిత్ మాత్రం నాలుగు సార్లు పేస్ బౌలర్లకు వికెట్ ఇచ్చాడు. వీరిద్దరూ టి20 ప్రపంచ కప్ తర్వాత ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే, అనంతరం కాస్త విశ్రాంతి తీసుకుని శ్రీలంకతో వన్డే సిరీస్ కు వచ్చారు. కానీ, మూడు మ్యాచ్ ల ఆ సిరీస్ లో రాణించలేదు. దీంతో 27 ఏళ్ల తర్వాత లంక చేతిలో టీమ్ ఇండియా వన్డే సిరీస్ కోల్పోయింది. ఇలాగైతే రోహిత్, కోహ్లిలకు టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ చోటు కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ ఏడాది 250 పరుగులే..

ఇంగ్లండ్ తో ఈ ఏడాది మొదట్లో జరిగిన టెస్టు సిరీస్ కు కోహ్లి దూరంగా ఉన్నాడు. ఇక 2024లో మొత్తం ఆరు టెస్టులు ఆడిన అతడు 250 పరుగులే చేశాడు. బంగ్లాదేశ్ పై చేసిన 70 పరుగులే అత్యధికం. రోహిత్ శర్మ 11 టెస్టుల్లో 588 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలూ ఉన్నాయి. కాగా, టీమ్ ఇండియాలో చోటుకు పోటీ తీవ్రంగా ఉంది. 35 ఏళ్ల కోహ్లీ, 37 ఏళ్ల రోహిత్‌ శర్మ వరుసగా విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి స్థానాలు పదిలంగా ఉండడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News