గుకేశ్ పై లిరెన్ కావాలనే ఓడాడు.. రష్యా సంచలన ఆరోపణలు

ఇప్పుడు చదరంగం ప్రపంచ చాంపియన్ షిప్ లో భారత కుర్రాడు 18 ఏళ్ల గుకేశ్ దొమ్మరాజు చైనాకు చెందిన లిరెన్ పై సాధించిన విజయంపైనా పనికిరాని విమర్శలు వస్తున్నాయి.

Update: 2024-12-13 07:16 GMT

ఒక గొప్ప విజయం వెనుక అనేక వివాదాలు సహజం.. 2003లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం అనంతరం ఇలానే ఆరోపణలు వచ్చాయి.. సొంతగడ్డపై భారత్ 1996లో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ లో శ్రీలంక చేతిలో ఓడిన అనంతరం ఇలానే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు చదరంగం ప్రపంచ చాంపియన్ షిప్ లో భారత కుర్రాడు 18 ఏళ్ల గుకేశ్ దొమ్మరాజు చైనాకు చెందిన లిరెన్ పై సాధించిన విజయంపైనా పనికిరాని విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది చైనా నుంచి కాదు.. రష్యా తరఫున కావడం గమనార్హం.

రష్యా ఆధిపత్యానికి గండికొట్టినందుకేనా?

ప్రపంచ చదరంగంలో ఒకప్పుడు రష్యాది పూర్తి ఆధిపత్యం. గ్యారీ కాస్పరోవ్, అనతోలి కార్పొవ్.. దశాబ్దాల పాటు ఆధిపత్యం సాగించారు. అలాంటివారికి గండి కొట్టాడు భారత్ కు చెందిన విశ్వనాథన్ ఆనంద్. దీంతో రష్యాకు ఇప్పటికీ ఈ విషయంలో భారత్ అంటే కనిపించని దుగ్ధ ఉన్నట్లుంది. తాజాగా లిరెన్ పై గుకేశ్ సాధించిన విజయాన్నీ ఈ కోణంలోనే చూస్తోంది.

గురువారం ముగిసిన ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పై రష్యా ఫెడరేషన్‌ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. గుకేశ్‌ చేతిలో లిరెన్‌ కావాలనే ఓడాడని కనీవిని ఎరుగని వ్యాఖ్యలకు దిగింది. వాస్తవానికి మేధో క్రీడ అయినందున చెస్ లో ఇలాంటి ఆరోపణలు తక్కువ. అప్పుడెప్పుడో తప్ప ఇటీవలి కాలంలో చెస్ లో అవకతవకలు అనే వార్తలు రాలేదు. కానీ, ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పైనే విమర్శలు చేస్తోంది రష్యా.

హోరాహోరీగానే సాగిందిగా..

గుకేశ్, లిరెన్ మధ్య ప్రపంచ చాంపియన్ షిప్ హోరాహోరీగా సాగింది. మొత్తం 14 రౌండ్లకు గాను చివరి రౌండ్ లోనే ఫలితం తేలింది. లేదంటే తక్కువ కాల వ్యవధితో ముగిసే రౌండ్ లు ఆడించేవారు. ఇక 14వ రౌండ్‌ లో లిరెన్‌ ఘోర తప్పిదం చేశాడు.

నాలుగు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్ 58వ ఎత్తు వరకు వచ్చింది. అయితే, 55వ ఎత్తులో లిరెన్‌ ఏనుగును కదిపాడు. దీనిని గుకేశ్‌ అందిపుచ్చకుని విజయాన్ని గుంజుకున్నాడు. అయినా కూడా ఫలితంపై రష్యా చెస్‌ ఫెడరేషన్‌ సంచలన ఆరోపణలు చేస్తోంది. చైనా దిగ్గజ ఆటగాడైన లిరెన్‌ కావాలనే ఓడిపోయాడని అంటోంది.

లిరెన్ చర్యలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని.. అతడి ఓటమి అభిమానులు, నిపుణులను నివ్వెరపర్చిందని పేర్కొంటోంది. పటిష్ఠ స్థితిలో ఉండి కూడా లిరెన్ ఓడిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓటమి అసంభవం అనే స్థితి నుంచి లిరెన్ చేసిన తప్పును చూస్తే పలు అనుమానాలు వస్తున్నాయని పేర్కొంది. అందుకని అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ప్రత్యేకంగా విచారణ జరపాలని రష్యా చెస్ ఫెడరేషన్‌ చీఫ్‌ అండ్రీ ఫిలటోవ్‌ డిమాండ్‌ చేశాశాడు.

Tags:    

Similar News