అమ్మాయిగా మారిన టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ కుమారుడు!
23 ఏళ్ల ఆర్యన్ హార్మోన్ రిప్లేస్ మెంట్ థెరపీతో అమ్మాయి అయ్యాడు.
By: Tupaki Desk | 11 Nov 2024 11:30 AM GMTఇటీవలి కాలంలో అబ్బాయిగా పుట్టిన వారు అమ్మాయిలుగా మారడం.. అమ్మాయిలు అబ్బాయిలు కావడం అనేది చూస్తూ, చదువుతూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమార్తె పురుషుడిగా మారేందుకు లింగమార్పిడి చేయించుకుంది. అంతెందుకు..? అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కుమారుడు సైతం అమ్మాయిగా మారాడు. లింగమార్పిడి ద్వారా వీరు తమ జెండర్ మార్చుకుంటున్నారు. ఈ తరహా ధోరణి క్రమంగా పెరుగుతోందనేందుకు అనేక ఉదాహరణలున్నాయి. అలాంటిదే మరో ప్రముఖుడి ఇంట కూడా జరిగింది.
భారత క్రికెట్ కోచ్ ఇంట్లో
భారత క్రికెట్ లో సంజయ్ బంగర్ అంటే మంచి పేరే ఉంది. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో రైల్వేస్ కు ఆడడం దగ్గరనుంచి బంగర్ ప్రత్యేకంగా నిలిచేవాడు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావాల్సిన సమయంలో టీమ్ ఇండియాలోకి వచ్చిన బంగర్ సుదీర్ఘ కాలం సేవలందించేలా కనిపించాడు. కానీ, నిలకడ లేకపోవడంతో ఒకటీ రెండు మంచి ఇన్నింగ్స్ ల తర్వాత జట్టుకు దూరమయ్యాడు. మొత్తమ్మీద 2001-04 మధ్య 12 టెస్టులు ఆడిన బంగర్ ఒక సెంచరీ కొట్టాడు. ఏడు వికెట్లు తీశాడు. 15 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించి 180 పరుగులు చేశాడు. ఏడు వికెట్లు పడగొట్టాడు. 300 వికెట్లు, 8 వేలపైగా పరుగుల రికార్డున్న ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పోలిస్తే బంగర్ కు మరిన్ని అవకాశాలు రావాల్సింది. కాగా, రిటైర్మెంట్ తర్వాత తర్వాత బంగర్ కోచ్ గా మారాడు. 2014-19 మధ్య టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ గా పనిచేశాడు. ఐపీఎల్ లోనూ పంజాబ్ కింగ్స్ కు కోచ్ గా వ్యవహరించాడు. 2014లో బంగర్ కోచ్ గా ఉన్నప్పుడే పంజాబ్ ఫైనల్స్ కు చేరింది.
కుమారుడి నుంచి కుమార్తెగా
52 ఏళ్ల బంగర్ మహారాష్ట్రకు చెందినవాడు. ఇప్పుడు ఇతడి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే బంగర్ కుమారుడు ఆర్యన్ అమ్మాయిగా మారాడు. 23 ఏళ్ల ఆర్యన్ హార్మోన్ రిప్లేస్ మెంట్ థెరపీతో అమ్మాయి అయ్యాడు. తన పేరును ఆర్యన్ బంగర్ నుంచి అనయ బంగర్ గా మార్చుకున్నాడు. ఈ సంగతిని తనే స్వయంగా తెలిపాడు. ఇందుకు 10 నెలల సమయం పట్టిందంటూ ఆ సమయంలో తానెలా మారినదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.