ఈ సమయంలో రోహిత్ పై చీప్ విమర్శలా..? కెప్టెన్ కు బీసీసీఐ సపోర్ట్
‘రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు. బరువు తగ్గాలి’ అంటూ అప్రస్తుత కామెంట్లు చేసిందే కాక.. వాటిని సమర్థించుకుంటూ శమా క్షమించరాని తప్పు చేస్తున్నారు.;
ఆస్ట్రేలియా వంటి ప్రత్యర్థితో.. చాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నీ ముంగిట.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు శమా మొహమ్మద్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్ వంటి క్లాస్ టాప్ ప్లేయర్ ను ఉద్దేశించి ఏ మాత్రం సహించని వ్యాఖ్యలు చేసి శమా ఓ విధంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న వన్డే సెంచరీ కొట్టిన రోహిత్.. ప్రతి మ్యాచ్ లో రాణించకున్నా.. జట్టును మాత్రం అద్భుతంగా నడిపిస్తున్నాడు. అలాంటి రోహిత్ పై శమా అనవసరం నోరు జారారు.
‘రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు. బరువు తగ్గాలి’ అంటూ అప్రస్తుత కామెంట్లు చేసిందే కాక.. వాటిని సమర్థించుకుంటూ శమా క్షమించరాని తప్పు చేస్తున్నారు. శమా కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి కావడంతో ఇదే అదనుగా బీజేపీ దాడి ప్రారంభించింది. శమా వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. ఆమెను పోస్టును తొలగించాలని ఆదేశించింది.
వీటి మధ్యలో బీసీసీఐ జోక్యం చేసుకుంది. టీమ్ కెప్టెన్ ను ఇలా అనడం ఏమాత్రం తగదంటూ శమాకు తలంటింది. చాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలో ఉండగా ఇలాంటి కామెంట్లు చేస్తారా? అంటూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తప్పుబట్టారు. ఇవి చౌకబారు వ్యాఖ్యలని.. వ్యక్తిగత ప్రచారం కోసమే ఇలాంటివి చేస్తారని వ్యాఖ్యానించారు. ఇకపైన అయినా దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.
ఇలాంటి అసందర్భ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఆటగాడిపై, లేదా జట్టుపై ప్రతికూల ప్రభావం చూపి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని సైకియా వ్యాఖ్యానించారు.
కాగా, రోహిత్ 17 ఏళ్లుగా టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు. యువకుడిగా ఉన్నప్పటి ఫిట్ నెస్ 37 ఏళ్ల వయసులో ఉంటుందని భావించలేం. అయినప్పటికీ పరుగులు సాధిస్తూ జట్టును నడిపిస్తున్నాడు. కుర్రాళ్ల గేమ్ గా పిలుచుకునే టి20 ప్రపంచ కప్ ను కూడా సాధించిపెట్టాడు. తన శరీర స్వభావం రీత్యా కాస్త బరువు పెరిగాడు.. అయినా, ఆ స్థాయి ఆటగాడిపై శమా క్షమించరాని వ్యాఖ్యలు చేయడమే కాక.. వాటిని సమర్థించుకునే పయత్నం చేస్తున్నారు. క్రీడాకారుడి ఫిట్ నెస్ గురించి చెబుతూ మాత్రమే తాను ఆ సాధారణ ట్వీట్ చేశానని.. అది బాడీ షేమింగ్ కాదని అంటున్నారు. రోహిత్ ఓవర్ వెయిట్ ఉన్నాడని తాను భావించానని.. దాని గురించే పోస్టు చేశానని పేర్కొన్నారు.
టీఎంసీ రగడ..
‘‘రోహిత్ జట్టులోనే ఉండకూడదదు.. శమా చెప్పింది నిజమే?’’ అంటూ టీఎంసీ ఎంపీ సౌగథ రాయ్ తాజా వివాదానికి మరింత ఆజ్యం పోశారు.