బ్యాట్ వాడటం మొదలుపెడితే... ఉప్పల్ లో హైదరాబాద్ బ్యాటర్స్ ఊచకోత!
మరి ఈ మ్యాచ్ ఆధ్యంతం ఎలా సాగిందనేది ఇప్పుడు చూద్దాం..!
ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా జరిగింది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్తిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కి దిగింది. ఈ సందర్భంగా... "బ్యాట్ వాడటం మొదలుపెడితే మాకంటే బాగా ఎవడూ ఆడలేడు" అన్నట్లుగా చెలరేగిపోయారు హైదరాబాద్ బ్యాటర్స్. మరి ఈ మ్యాచ్ ఆధ్యంతం ఎలా సాగిందనేది ఇప్పుడు చూద్దాం..!
మూడో ఓవర్లో మొదలు!:
బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట స్లోగా ప్రారంభించినట్లు కనిపించింది. ఇందులో భాగంగా... మొదటి ఓవర్లో ఒక ఫోర్ సాయంతో 7 పరుగులు సాధించగా.. రెండో ఓవర్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసింది. దీంతో... రెండు ఓవర్లకు హైదరాబాద్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 18 పరుగులకు చేరింది.
ఇక మఫాకా వేసిన మూడో ఓవర్లో మూడో బంతి నుంచి హెడ్ మొదలుపెట్టేశాడు. ఇందులో భాగంగా... వరుసగా రెండు సిక్స్ లు, రెండు ఫోర్లు బాదాడు. దీంతో మూడు ఓవర్లకు 40/0 కి చేరింది హైదరాబాద్ స్కోరు.
తొలిదెబ్బ కొట్టిన హార్దిక్!:
ఫుల్ జోష్ లో కదులుతున్న హైదరాబాద్ జట్టుకి ఫస్ట్ బ్రేక్ వేశాడు హార్దిక్ పాండ్యా. ఇందులో భాగంగా అతడు వేసిన 4.1 ఓవర్ లో మయాంక్ (11).. టిమ్ డెవిడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో... అభిషేక్ శర్మ క్రీజ్ లోకి వచ్చాడు. అయినప్పటికీ హెడ్ మాత్రం ఆగలేదు. ఇదే ఓవర్లో వరుసగా ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఐదు ఓవర్లకు హైదరాబాద్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 58 పరుగులకు చేరింది.
హెడ్ విజృంభణ... 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!:
బ్యాటింగ్ కి వచ్చినప్పటి నుంచి బాదుడే బాదుడే అన్నట్లుగా మొదలుపెట్టిన టావిస్ హెడ్... 18 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. దీంతో 6 ఓవర్లు (పవర్ ప్లే) పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి 81 పరుగులకు చేరింది.
మోత మోగిస్తోన్న హైదరాబాద్!:
హైదరాబాద్ బ్యాటర్స్ ఈ రోజు చెలరేగిపోతున్నారు. బ్యాట్ చేతపట్టి మైదానంలో దిగడం ఆలస్యం.. బౌండరీలు బాదడం మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగా అభిషేక్ శర్మ 7 ఓవర్లో 3 సిక్స్ లతో మోత మోగించేశాడు. దీంతో హైదరాబాద్ స్కోరు 7 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.
ముంబైకి బిగ్ రిలీఫ్... ట్రావిస్ హెడ్ ఔట్!
ముంబై బౌలర్లకు ఫ్లడ్ లైట్స్ వెలుతురులో చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు. కోయెట్జీ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ వద్ద నమన్ కు దొరికాడు. అప్పటికి హెడ్ వ్యక్తి గత స్కోరు 62.. (24 బంతుల్లో 3 సిక్స్ లు, 9 ఫోర్లు). దీంతో... 8 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 117 పరుగులు చేసింది.
16 బంతుల్లో అభిషేక్ హాఫ్ సెంచరీ... 10 ఓవర్లకు 148!:
ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు ముంబై బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ఇందులో భాగంగా 18 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ చేస్తే... 16 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.
హైదరాబాద్ మూడో వికెట్:
దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ.. పియూష్ చావ్లా బౌలింగ్ లో ఔటయ్యాడు. 11వ ఓవర్ చివరి బంతిని షాట్ ఆడగా.. నమన్ కి దొరికేశాడు. దీంతో 11 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 161. అభిషేక్ శర్మ వ్యక్తిగత స్కోరు 63 (23 బంతుల్లో 3 ఫోర్లు, 7 స్కిక్ లు)!
200 దాటిన హైదరాబాద్ స్కోర్:
15 ఓవర్లు పూర్తయ్యే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 200 పరుగులకు చేరింది. ఈ సమయానికి క్రీజ్ లో మార్క్రమ్ (31), క్లాసెన్ (26) లు ఉన్నారు.
24 బంతుల్లో హాల్ఫ్ సెంచరీ... ఇప్పుడు క్లాసెన్ వంతు:
బ్యాట్ పట్టి మైదానంలో దిగిన హైదరాబాద్ బ్యాటర్లు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు! ఆడుతున్న ప్రతీ బంతినీ బౌండరీ దాటించాలనే ప్రయత్నంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు నమోదవ్వగా... ఈసారి 24 బంతుల్లో 51 (1 ఫోరు, 5 సిక్స్ లు) పరుగులు చేశాడు క్లాసెన్! దీంతో 18 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు.
సన్ రైజర్స్ సరికొత్త రికార్డ్!:
ముంబై ఇండియన్స్ తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో భాగంగా... టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు చేసింది.
హైదరాబాద్ బ్యాటర్స్ లో... మయాంక్ అగర్వాల్ (11), ట్రావిస్ హెడ్ (62), అభిషేక్ శర్మ (63), మార్క్రమ్ (42*), క్లాసెన్ (80*) పరుగులు సాధించారు.
278 పరుగుల లక్ష్యంతో బరిలోకి ముంబై:
278 పరుగుల భారీ లక్ష్యంతో ముంబై బ్యాటర్స్ బరిలోకి దిగారు. ఇందులో భాగంగా... రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ జోడిగా ఎంటరయ్యారు. ఈ సమయంలో కాస్త స్లోగా స్టార్ట్ చేసిన.. అనంతరం దుకుడు పెంచింది.
మూడు ఓవర్లకే 50 పరుగులు:
భారీ లక్ష్యం ముందుండటంతో ముంబై బ్యాటర్లు బ్యాట్ ఝులిపించారు. ఇందులో భాగంగా... రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు చెలరేగి ఆడారు. దీంతో... 3 ఓవర్లకే ముంబై ఇండియన్స్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 50 పరుగులకు చేరింది. ఈ సమయంలో... ఇషాన్ కిషన్ (27*), రోహిత్ శర్మ (18*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
ముంబై ఫస్ట్ వికెట్ డౌన్:
దూకుడుగా చేజింగ్ జరుగుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ కి బ్రేక్ వేశాడు షాబాజ్ అహ్మద్. నాలుగో ఓవర్ రెండో బంతికి కిషన్ ను ఔట్ చేశాడు. అప్పటికి కిషన్ వ్యక్తిగత స్కోరు 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 34.
ఓఎంజీ... రోహిత్ శర్మ ఔట్!
తొలి వికెట్ కోల్పోయి కాస్త స్లో అయిన ముంబై కి మరో భారీ దెబ్బ తగిలింది. ఇందులో భాగంగా మాంచి దూకుడు మీదున్నట్లు కనిపించిన రోహిత్ శర్మ... కమిన్స్ బౌలింగ్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అప్పటికి శర్మ వ్యక్తిగత స్కోరు 12 బంతుల్లో ఒక ఫోరు, 3 సిక్స్ ల సాయంతో 26 పరుగులు. దీంతో ముంబై స్కోరు 5 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 67.
100 దాటిన ముంబై స్కోరు:
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో... 8వ ఓవర్ 3వ బంతికే 100 పరుగుల మార్కును చేరుకుంది. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు. ఈ సమయానికి నమన్ (19*), తిలక్ వర్మ (16*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
10 ఓవర్లకు ముంబై భారీ స్కోర్!
రెండు వికెట్లు పడినప్పటికీ ముంబై బ్యాటర్లు దూకుడు విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఇందులో భాగంగా... 10 ఓవర్లో 22 పరుగులు రాబట్టిన ముంబై... 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీంతో ముంబై విజయానికి ఇంక 60 బంతుల్లో 137 పరుగులు అవసరం అయ్యింది.
తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ముంబై 3 వికెట్ డౌన్:
ముంబై ఇండియన్స్ నుంచి హాఫ్ సెంచరీ నమోదైంది. తిలక్ వర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో 52 పరుగులు సాధించాడు. మరోపక్క దూకుడు మీదున్న నమన్ ఔటయ్యాడు. అప్పటికి నమన్ వ్యక్తిగత స్కోరు 14 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 30.
దీంతో... 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 3 వికెట్ల నష్టానికి 151.
బిగ్ వికెట్... తిలక్ వర్మ ఔట్:
బౌండరీలతో హోరెత్తించేస్తున్న వేళ తిలక్ వర్మ జోరుకు బ్రేక్ పడింది. ఇందులో భాగంగా... కమిన్స్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ కి ప్రయత్నించిన తిలక్ వర్మ.. మయాంక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి వర్మ వ్యక్తిగత స్కోరు 64 (34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్ లు).
దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై స్కోరు 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు!
30 బంతుల్లో 93 పరుగులు!:
278 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. లక్ష్యం దిశగా వేగంగానే కదిలింది. ఈ క్రమంలో ఇంక చివరి ఐదు ఓవర్ల మ్యాచ్ మిగిలి ఉన్న సమయానికి... విజయానికి ఇంకా 93 పరుగులు కావాలి. ఈ సమయంలో క్రీజ్ లో హార్దిక్ (20*), డేవిడ్ (2*) ఉన్నారు.
200 దాటిన ముంబయి స్కోర్:
17వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ 20 పరుగులు ఇవ్వడంతో 17 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై స్కోరు 4 వికెట్ల నష్టానికి 210కి చేరింది. ఈ ఓవర్లో టిం డేవిడ్ వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్ బౌండరీలు బాదాడు. ప్రస్తుతం 23 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
ఐదో వికెట్ డౌన్... కెప్టెన్ గాన్!
విజయానికి చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్న దశలో.. ముంబై ఇండియన్స్ కి షాక్ తగిలింది. ఇందులో భాగంగా.. కెప్టెన్ హర్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. జయదేవ్ బౌలింగ్ లో క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి హార్దిక్ వ్యక్తిగత స్కోరు 20 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్స్ సాయంతో 24 పరుగులు.
దీంతో.. 18 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 224. కాగా... ఇంకా విజయానికి 12 బంతుల్లో 54 పరుగులు కావాలి.
19 ఓవర్ లో పాట్ కమిన్స్ అద్భుతం!
ముంబై బ్యాటర్స్ చితక్కొడుతున్న సమయంలో.. అత్యంత కీలకమైన 19 ఓవర్ ని కెప్టెన్ కమిన్స్ బౌల్డ్ చేశాడు. వాస్తవానికి ఈ ఓవర్ అనేదే డిసైండింగ్ పాయింట్! ఈ సమయంలో అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన కమిన్స్.. ఈ ఓవర్ లో ఒక్క బౌండరీ కూడా వెళ్లకుండా కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో... సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ మోస్ట్ విజయం కన్ ఫాం అయిపోయింది!
6 బంతుల్లో 47 పరుగులు!:
19 ఓవర్ లో కమిన్స్ చేసిన అద్భుతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయింది. అయితే అధికారిక ప్రకటన కోసం 20వ ఓవర్ వేయాలి! దీంతో బాల్ అందుకున్న మయాంక్ మార్కాండేయ.. చివరి ఓవర్లో 15 పరుగులు ఇచ్చాడు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై స్కోరు 5 వికెట్ల నష్టానికి 246!
దీంతో... ముంబై పై 31 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. సరికొత్త రికార్డ్ లు నెలకొల్పుతూ.. ప్రత్యర్థులకు భారీ హెచ్చరికలు పంపుతూ... ఐపీఎల్ 17లో బోణీ కొట్టింది.