సన్నటి నడుము ఉంటేనే సూపర్ ఫిట్టా? సర్ఫరాజ్ ఖాన్ అన్ ఫిట్టా?

రెండేళ్ల కిందట.. ముంబై బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు చేస్తున్నాడు.

Update: 2024-10-22 14:30 GMT

రెండేళ్ల కిందట.. ముంబై బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు చేస్తున్నాడు. కానీ, జాతీయ జట్టులోకి పిలుపు మాత్రం రావడం లేదు. దీనికి సర్ఫరాజ్ అధిక బరువే కారణమనే వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించారు. స్లిమ్ గా ఉండే క్రికెటర్లు కావాలంటే మోడల్స్ ను ఎంపిక చేయండి అంటూ మండిపడ్డారు. అయితే, అదే సర్ఫరాజ్ ఇప్పుడు టీమ్ ఇండియాలోకి వచ్చేశాడు. జనవరి-ఫిబ్రవరిలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్, తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్ లో భారీ సెంచరీ (150) చేశాడు. అయినప్పటికీ సర్ఫరాజ్ కు తుది జట్టులో చోటు ఖాయమేనా? అని చెప్పలేని పరిస్థతి. దీనికి కారణం.. అతడి శరీరం సైజు.

ఏకధాటిగా 450 బంతులు ఆడేంత..

వాస్తవానికి ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ కు ముందు సర్ఫ ఇరానీ ట్రోఫీలో అజేయంగా డబుల్ సెంచరీ (222) చేశాడు. దీనికిముందు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లోనూ సర్ఫరాజ్ తుది జట్టులో లేదు. అయితే, న్యూజిలాండ్ తో తొలి టెస్టుకూ చోటు కష్టమే అయినా శుభ్ మన్ గిల్ మెడ పట్టేయడంతో చివరి నిమిషంలో సర్ఫరాజ్ కు అవకాశం దక్కింది. దీనిని సద్వినియోగం చేసుకుని జట్టులో కొనసాగించక తప్పని పరిస్థితి కల్పించాడు. అయితే, రెండో టెస్టుకు గిల్ అందుబాటులోకి వస్తే ఎవరిని తప్పించాలి? అనే ప్రశ్న వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఫిట్‌ నెస్‌ ను సాకుగా చూపుతూ సర్ఫరాజ్ పై వేటు వేస్తారనే అభిప్రాయం వస్తోంది. అయితే, ఆ అవకాశం ఇవ్వకూడదని ఫిట్‌ నెస్‌ పై సర్ఫరాజ్‌ దృష్టి పెట్టాడట. స్ట్రెంత్, కండీషనింగ్‌ కోచ్‌ తో కలిసి ఫిట్‌ నెస్‌ కోసం సర్ఫ కష్టపడుతున్నాడని అతడి ముంబై సహచరుడు, టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్‌ సూచించిన వంట మనిషి సర్ఫరాజ్‌ ఆహార నియమాలను చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా టూర్ వేళకు మరింత మెరుగ్గా శరీరాన్ని మార్చుకోవాలన్నది సర్ఫరాజ్‌ లక్ష్యంగా చెప్పాడు.

శరీర ఆకృతి కారణంగా సర్ఫరాజ్ బొద్దుగా కనిపిస్తాడని.. కానీ 450 బంతుల పాటు క్రీజులో నిలిచి.. డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీల వంటి భారీ ఇన్నింగ్స్‌ ఆడే నైపుణ్యం అతడికి ఉందని వివరించాడు. సర్ఫ ఒక్క రోజు కూడా ప్రాక్టీస్‌ మానడని.. మ్యాచ్‌ ఉన్న రోజు కూడా సాధన చేస్తాడని సూర్యకుమార్ తెలిపాడు.

స్లిమ్ గా ఉంటేనే క్రికెటర్ అంటే ఎలా?

సర్ఫరాజ్ ఫిట్ నెస్ విషయం మరోసారి చర్చకు రావడంతో సునీల్ గావస్కర్ స్పందించారు. భారత క్రికెట్ లో స్లిమ్ గా ఉంటేనే క్రికెటర్ అనే అభిప్రాయం ఉందని.. ఇది తప్పని పేర్కొన్నారు. ఇకమీదటైనా ఈ ఆలోచన మానుకోవాలని సూచించాడు. గతంలోనూ సర్ఫరాజ్ విషయమై గావస్కర్ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో మరోసారి ఆయన అభిప్రాయం చర్చకు వచ్చింది.

కొసమెరుపు: మంగళవారం (అక్టోబరు 22) సర్ఫరాజ్ ఖాన్ పుట్టిన రోజు. 1997లో పుట్టాడు. 27 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అయితే, దీనికి ఒక్క రోజు ముందు అక్టోబరు 21న (సోమవారం) అతడికి కొడుకు పుట్టాడు.

Tags:    

Similar News