బాదుడే బాదుడు... విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ కు భారీ విక్టరీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17లో హైదరాబాద్ జట్టు చెలరేగిపోతుంది! ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఎక్కడైనా.. తమదైన దూకుడు కొనసాగిస్తున్నారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17లో హైదరాబాద్ జట్టు చెలరేగిపోతుంది! ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఎక్కడైనా.. తమదైన దూకుడు కొనసాగిస్తున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కొనసాగిస్తున్నారు. బంతి ఎలాంటిదైనా.. బౌలర్ మరెవరైనా.. ఏమాత్రం జాలీ దయా కరుణా లేకుండా.. బంతిని బలంగా బాదుతున్నారు.. ఫలితంగా అది కాస్తా మైదానాన్ని విడిచి జనాల్లోకి పారిపోతోన్న పరిస్థితి ఎదురవుతుంది.
అవును... ఈసారి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టించేస్తుంది. తన రికార్డ్స్ ని తానే తిరగరాస్తూ.. ప్రత్యర్థులకు సరికొత్త సవాళ్లు విసురుతుంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో చెలరేగి భారీ విక్టరీ సాధించింది. సరికొత్త రికార్దులు నెలకొల్పింది. ఇక్క్డ ప్రత్యకంగా చెప్పుకోవాల్సింది సన్ రైజర్స్ బ్యాటర్స్ గురించి. అందులోనూ ప్రత్యేకంగా ఓపెనర్ ట్రావెన్స్ హెడ్ గురించి.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89: 32 బంతుల్లో 11×4, 6×6) అభిషేక్ శర్మ (46: 12 బంతుల్లో 2×4, 6×6) భారీ ఆరంభాన్నిస్తే... షాబాజ్ అహ్మద్ (59: 29 బంతుల్లో 2×4, 5×6), నితీశ్ కుమార్ (37: 27 బంతుల్లో 2×4, 2×6) ఆ దూకుడు కంటిన్యూ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇందులో భాగంగా... క్రీజ్ లోకి అడుగుపెట్టినప్పటినుంచి ట్రావిస్ హెడ్ ఫోర్లు, సిక్సర్ల మోత మోగించేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా హెడ్ కు పోటీగా బంతిని పగపట్టినట్లు బాదాడు. ఈ క్రమంలో తొలి ఐదు ఓవర్లలోనూ వరుసగా... 19, 21, 22, 21, 20.. చొప్పున ఓవర్ కు 20కి అటు ఇటుగా పరుగులు చేశారు. ఫలితంగా... కేవలం 5 ఓవర్లలోనే స్కోరును వంద దాటించేశారు. ఇదే క్రమంలో 6 ఓవర్ లోనూ 22 పరుగులు రాబట్టి పవర్ ప్లే అయ్యేసరికే 125 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ క్రమంలో... కేవలం 16 బంతుల్లోనే హెడ్ అర్ధశతకం పూర్తవ్వగా... అభిషేక్ సైతం 11 బంతుల్లోనే 46 పరుగులు చేసి కుల్ దీప్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అప్పుడు కానీ ఢిల్లీ ఆటగాళ్లు, అభిమానుల్లో ఉపశమనం కనిపించలేదు! అదే ఓవర్లో అతను మార్క్రమ్ (1)ను కూడా ఔట్ చేశాడు కుల్ దీప్. ఇదే క్రమంలో... హెడ్ ను కుల్ దీప్, క్లాసెన్ ను అక్షర్ పెవిలియన్ చేర్చడంతో ఢిల్లీకి పెను ముప్పు తొలగిందనే చెప్పుకోవాలి.
ఇక చివర్లో నితీశ్ కుమార్ తో కలిసి షాబాజ్ అనూహ్యంగా చెలరేగడంతో మళ్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ జోడీ అయిదో వికెట్ కు 47 బంతుల్లో 67 పరుగులు జోడించింది. ఢిల్లీ బౌలర్లలో కుల్ దీప్ 4 వికెట్లు పడగొట్టగా... ముకేష్, అక్షర్ లు తలో వికెట్ దక్కించుకున్నారు.
ఛేదనలో పృథ్వీ షా (16) తొలి నాలుగు బంతులకు నాలుగు ఫోర్లు కొట్టడంతో ఢీల్లీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది కానీ... అయిదో బంతికి ఔటవ్వడం.. మరో ఓపెనర్ వార్నర్ (1)ను భువనేశ్వర్ ఔట్ చేయడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. కానీ జేక్ ఫ్రేజర్.. (65: 18 బంతుల్లో 5×4, 7×6) బలమైన పునాది వేశాడు. అతను ఔటయ్యాక గాడి తప్పిన ఢిల్లీ.. లక్ష్యానికి దూరమైంది.
అనంతరం అభిషేక్ పోరెల్ (42: 22 బంతుల్లో 7×4, 1×6) పంత్ (44: 35 బంతుల్లో 5×4, 1×6) కూడా పోరాడినా ఫలితం దక్కలేదు. 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఢీలీ కుప్పకూలింది. ఫలితంగా... సన్ రైజర్స్ 67 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 4 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా... మార్కండే, నితీశ్ లు తలో రెండు వికెట్లు తీసుకుని ఢిల్లీని కూల్చడంతో సహకరించారు!