టీమ్ ఇండియాకు 'కెప్టెన్ స్మిత్' ఫార్ములా

ఆ కెప్టెన్ స్మిత్ ఎవరో కాదు.. ఓపెనర్ 'యశస్వి జైశ్వాల్‌'. గత నెలలోనే 23వ ఏట అడుగుపెట్టిన జైశ్వాల్.. ఇప్పటికే టి20లు, టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్నాడు.

Update: 2025-01-18 14:30 GMT

ప్రస్తుతం ప్రత్యేకించి టెస్టుల్లో టీమ్ ఇండియా సంధి దశలో ఉంది. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ దగ్గరపడింది. మరో సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే తప్పుకొన్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతడికి ఫిట్ నెస్ సమస్యలు ఎక్కువ. మరో స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఏడాదిపైగా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. శుబ్ మన్ గిల్ వంటి కుర్రాడు, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు ఉన్నా వీరిలో నిలకడ లోపిస్తోంది.

రోహిత్, కోహ్లి మరో ఏడాది ఏడాదిన్నర మాత్రమే ఆడగలరు. మరి భవిష్యత్ లో కెప్టెన్ ఎవరు..? ప్రత్యేకించి సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో..? ఈ నేపథ్యంలోనే బీసీసీఐ 'కెప్టెన్ స్మిత్' ఫార్ములాను అనుసరించనుందని తెలుస్తోంది.

ఆ కెప్టెన్ స్మిత్ ఎవరో కాదు.. ఓపెనర్ 'యశస్వి జైశ్వాల్‌'. గత నెలలోనే 23వ ఏట అడుగుపెట్టిన జైశ్వాల్.. ఇప్పటికే టి20లు, టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్నాడు. దీంతో అతడినే భవిష్యత్ టెస్టు కెప్టెన్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఆ నేపథ్యంలోనే 'కెప్టెన్ స్మిత్' ఫార్ములాను తెరపైకి తెస్తున్నారు.

'కెప్టెన్ స్మిత్' అంటే ఏమిటో కాదు.. గతంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ గా ఉన్న గ్రేమ్ స్మిత్ ను 22-23 ఏళ్ల వయసుకే కెప్టెన్ చేసింది. 2000లో బయటపడిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో హాన్సీ క్రానేపై వేటు పడగా.. ఆల్ రౌండర్ షాన్ పొలాక్ ను కెప్టెన్ చేశారు. 2003లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్ లో దారుణ ఓటమితో దక్షిణాఫ్రికా బోర్డు మేల్కొంది. 23 ఏళ్ల యువకుడైన గ్రేమ్ స్మిత్ ను కెప్టెన్ చేసింది. అతడు 100 టెస్టులకు పైగా దక్షిణాఫ్రికాకు కెప్టెన్ చేశాడు. కొత్త జట్టును నిర్మించాడనే మంచి పేరు తెచ్చుకున్నాడు. టెస్టులు, వన్డేల్లో దక్షిణాఫ్రికాను బలంగా తీర్చిదిద్దాడు. 109 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించి 53 మ్యాచ్‌ లలో విజయాలనందించాడు. చివరగా అతడి కెప్టెన్సీలో 12 విదేశీ సిరీస్‌ లలో దక్షిణాఫ్రికా ఒక్కటీ ఓడిపోలేదు.

మైకేల్ క్లార్క్ గాయంతో తప్పుకోవడంతో ఆస్ట్రేలియా కూడా 2015లో బ్యాట్స్ మన్ స్టీవ్‌ స్మిత్‌ ను కెప్టెన్ చేసింది. అప్పటికి అతడికి 35 ఏళ్లే. తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్సీ అప్పగించింది. స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 38 టెస్టుల్లో 21 నెగ్గింది. స్మితం 66.67 సగటుతో 3,867 పరుగులు చేశాడు. వీటిలో 15 సెంచరీలు ఉండడం విశేషం. 2018 నాటి బాల్‌ ట్యాంపరింగ్‌ స్కాం గనుక లేకుంటే స్మిత్ ఇప్పటికీ కెప్టెన్ గా ఉండేవాడే.

టీమ్ ఇండియా తాజాగా ఆస్ట్రేలియా సిరీస్‌ లో ఓడిపోయాక జరిగిన సమీక్షలో హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా యశస్విని భవిష్యత్ కెప్టెన్ గా సూచించాడట. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం రిషబ్‌ పంత్‌ కు ఓటేశాడట. కానీ, పంత్ కు దూకుడెక్కువ. రోడ్డు ప్రమాదం తర్వాత తిరిగొచ్చిన అతడి బ్యాటింగ్ సామర్థ్యంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంత్ టెస్టు జట్టు సారథ్యం చేపట్టే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో జైశ్వాల్ కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.

Tags:    

Similar News