3వ ఫైనల్..7 మ్యాచ్ లు.. 4 విజయాలు..టీమ్ ఇండియాకు సిసలైన 'టెస్టు'

స్వదేశంలో కాస్త పేస్ బౌలింగ్ కు అనుకూలించిన బెంగళూరు పిచ్ పైనే భారత్ బోల్తా కొట్టింది. అలాంటి ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్ లలో రెండు గెలవడం అంటే చాలా కష్టమే. నిజమైన టెస్టే.

Update: 2024-10-20 21:30 GMT

అరుణాచలం సినిమా గుర్తుందా..? మూడు వేల కోట్ల ఆస్తి సొంతం కావాలంటే 30 రోజుల్లో 30 కోట్లు న్యాయంగా ఖర్చుపెట్టాలి.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే టీమ్ ఇండియాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ముందున్నది ఏడు మ్యాచ్ లు.. అందులో కనీసం నాలుగు విజయాలు.. అలా జరిగితేనే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు ఖాయం.. ఆ.. ఏముంది రోహిత్ శర్మ టీమ్ కు ఇదేం పెద్ద సమస్య కాదంటారా? కానీ, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది.. ఈ ఏడు మ్యాచ్ లలో ఐదు ఆస్ట్రేలియాలో జరగనున్నాయి. స్వదేశంలో కాస్త పేస్ బౌలింగ్ కు అనుకూలించిన బెంగళూరు పిచ్ పైనే భారత్ బోల్తా కొట్టింది. అలాంటి ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్ లలో రెండు గెలవడం అంటే చాలా కష్టమే. నిజమైన టెస్టే.

ఇక్కడ 3-0తో గెలిచి ఉంటే..

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ).. గత రెండు చాంపియన్ షిప్ లలోనూ టీమ్ ఇండియా ఫైనల్స్ కు చేరింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో, మలిసారి ఆస్ట్రేలియాపై పరాజయం పాలైంది. వచ్చే జూన్ లో మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం టాప్ లో ఉంది. అయితే, న్యూజిలాండ్ తో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలుకావడం పెద దెబ్బకొట్టింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ లాంటి జట్టును 3-0తో క్లీన్ స్వీప్ చేస్తే ఆస్ట్రేలియాలో ఒక్క టెస్టు నెగ్గినా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరేది.

స్థానం మారలేదు.. గెలుపుశాతం పడిపోయింది

న్యూజిలాండ్ చేతిలో పరాజయం తర్వాత 2023-25 సీజన్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా టాప్ ప్లేస్ అలాగే ఉంది. కానీ, విజయాల శాతం తగ్గింది. అప్‌ డేటెడ్ పట్టిక ప్రకారం ఈ సీజన్ లో భారత్ 12 టెస్టుల్లో 8 గెలిచింది. మూడు ఓడింది. ఒకదానిని డ్రా చేసుకుంది. ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. పర్సంటేజీలో 74.24 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మన తర్వాత ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే, టీమ్ ఇండియాపై విజయంతో న్యూజిలాండ్‌ ఆరో స్థానం నుంచి 4కు చేరింది. 44.40 శాతంతో కొనసాగుతోంది.

టాప్-2 జట్లే ఫైనల్ కు..

2023-25 డబ్ల్యూటీసీ సీజన్ 70 శాతం పూర్తయింది. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి. భారత్ కు న్యూజిలాండ్ చేతిలో ఓడడంతో రాబోయే మ్యాచ్‌ లు చాలా కీలకం అయ్యాయి. 4 మ్యాచ్ లు గెలిస్తేనే డబ్ల్యూటీసీ టేబుల్ టాప్‌-2లో ఉంటుంది. కాగా, ఏడు మ్యాచ్ లకు గాను కివీస్ పై మరొక్కటి ఓడినా ఇబ్బందే. అప్పుడు ఆస్ట్రేలియాలో మూడు గెలవాల్సి ఉంటుంది. ఇక స్లో ఓవర్‌ రేట్‌ వంటివి ఉంటే.. ఆ ప్రభావం పాయింట్లు, పర్సంటేజీపై పడుతుంది.

Tags:    

Similar News