తుస్.. ఐపీఎల్ రిటెన్షన్.. తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు తీవ్ర నిరాశే
దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు పెద్దగా డబ్బులు దక్కడం లేదు.
ఉత్తరాది ఆటగాళ్లలా మనోళ్లు డాషింగ్ బ్యాట్స్ మెన్ కాదు.. పేస్, స్పిన్ బౌలింగ్ లోనూ ఏమంత మేటి కాదు.. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు పెద్దగా డబ్బులు దక్కడం లేదు. తాజాగా ప్రకటించిన రిటెన్షన్ జాబితానే దీనిని నిదర్శనం. ఒక్క అంబటి రాయుడు తప్ప అసలు మొదటినుంచి ఐపీఎల్ లో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు భారీ ధరలు పలికిన దాఖలాలు లేవనే చెప్పాలి. రాయుడు కూడా అనేక డక్కామొక్కీలు తిన్నాక ఐపీఎల్ లో గౌరవప్రదమైన ధర స్థాయికి వచ్చాడు.
దిగ్గజం అయినా..
ఐపీఎల్ 2008లో మొదలయ్యాక తెలుగు రాష్ట్రాలకు చెందిన వీవీఎస్ లక్ష్మణ్ కు దిగ్గజ హోదా ఇచ్చింది బీసీసీఐ. అప్పటి దక్కన్ చార్జర్స్ (డీసీ)కు ఆడిన లక్ష్మణ్ తర్వాత రాయుడు (ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్), తిలక్ వర్మ (ముంబై ఇండియన్స్) మాత్రమే ఐపీఎల్ లో తెలుగు రాష్ట్రాల నుంచి బలమైన ముద్ర చూపిన బ్యాట్స్ మెన్ కావడం గమనార్హం. కాగా, ఇటీవలి కాలం విషయానికి వస్తే హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్, విశాఖపట్టణానికి చెందిన పేస్ బౌలింగ్ ఆల్ రౌండ ర్ నితీశ్ కుమార్ రెడ్డి ఐపీఎల్ లో మంచి పేరు తెచ్చుకున్నారు.
11 కోట్లు వస్తాయనుకుంటే..
టీమ్ ఇండియాకు ఆడిన దేశవాళీ ఆటగాళ్లను క్యాప్డ్ గా పిలుస్తారు. ఇటీవలే బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్న నితీశ్ క్యాప్డ్ ఆటగాడు అయ్యాడు. లీగ్ నిబంధనల ప్రకారం అన్ క్యాప్డ్ ఆటగాళ్లకు రూ.4 కోట్లే దక్కుతాయి. క్యాప్డ్ అయితే రూ.11 కోట్ల వరకు పొందవచ్చు. కానీ, నితీశ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.6 కోట్లే పెట్టింది. దీనివెనుక వేలంలో వేరే ఆటగాడిపై ఖర్చు పెట్టే ఉద్దేశం ఉందనుకుంటా.
తిలక్ కు 8 కోట్లేనా?
గత రెండు సీజన్లలో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్ మన్. ఓ మాటలో చెప్పాలంటే ఓపెనర్, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటే తిలక్ నిలకడగా ఆడాడు. ఇషాన్ కిషన్ విఫలమవగా, సూర్య కుమార్ యాదవ్ గాయంతో దూరం కాగా.. ఆ బాధ్యతలను తిలక్ సమర్థంగా పోషించాడు. కానీ, తిలక్ కు రూ.8 కోట్లకే రిటైన్ చేసుకుంది ముంబై. అతడిని వేలానికి వదిలేసి ఉంటే రూ.10 కోట్లపైనే దక్కేవంటే ఆశ్చర్యం లేదు.
సిరాజ్ కు బెంగళూరు బైబై
కొన్నేళ్లుగా హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడుతున్నాడు. వాస్తవంగా చూస్తే.. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి అండ, బెంగళూరు కారణంగానే సిరాజ్ టీమ్ ఇండియాలోకి వచ్చాడని చెప్పాలి. అలాంటి సిరాజ్ ను ఈసారి ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడం షాకే. తీరిక లేని క్రికెటర్ కారణంగానేమో.. ఇటీవలి సిరాజ్ ఫామ్ తగ్గింది. దీంతో బెంగళూరు అతడిని వదులుకుంది.
కుర్రాడికీ చుక్కెదురే..
అండర్ 19 ప్రంపచ కప్ లో పాల్గొన్న తెలంగాణకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అర్వపల్లి అవినాశ్ ను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. అవినాశ్ మరీ కుర్రాడే కాబట్టి దీనిపై ఆందోళన లేదు. చెన్నై తరఫున అతడికి గత సీజన్ లో ఆడే అవకాశమే రాలేదు. అందుకని అవినాశ్ ను రిటైన్ చేసుకోవడంపై ఆశలు లేవు.
కాగా, టీమ్ ఇండియా తరఫున టెస్టు మ్యాచ్ లు ఆడిన హనుమ విహారి క్రమంగా ఐపీఎల్ కు దూరం అవుతున్నాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కుఃకి ఆడిన విహారిని కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు.