టి20 అండర్-19 ప్రపంచ కప్.. తెలుగమ్మాయిలు ముగ్గురు..కెప్టెన్ ఎవరంటే?

ఇందులోనూ ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-12-24 14:30 GMT

మహిళల క్రికెట్ మరింత ముందుకెళ్తోంది.. ఒకప్పుడు సీనియర్ల స్థాయికే పరిమితమైన క్రికెట్ ఇప్పుడు అండర్-19 స్థాయికీ వచ్చింది. ఇందులోనూ ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఏడాదిలో కొంగొత్తగా ప్రపంచ కప్ జరగనుంది.

మలేసియాలో..

క్రికెట్ లో పెద్దగా పేరు లేని దేశం మలేసియా. దీనికీ క్రికెట్ జట్టున్నా అదింకా ప్రపంచ స్థాయికి ఎదగలేదు. కాగా, 2025లో మలేసియాలోనే అండర్-19 ప్రపంచ కప్ జరగనుంది. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్‌ లో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు కప్ జరగనుంది. మొత్తం 41 మ్యాచ్‌ లున్నాయి. 16 జట్లను 4 గ్రూప్‌ లుగా విభజించారు. గ్రూప్‌ లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ కు, అక్కడ రెండు గ్రూప్‌ల్లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌ కు వెళ్తాయి.

టీమ్‌ఇండియా జనవరి 19న వెస్టిండీస్‌, 21న మలేసియా, జనవరి 23న శ్రీలంకతో తలపడనుంది. కాగా, 2023లో తొలిసారిగా అండర్-19 ప్రపంచ కప్ నిర్వహించారు. విజేత ఎవరో కాదు.. భారత జట్టే.

ఇక 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించారు. నిక్కీ ప్రసాద్‌ కెప్టెన్‌, సానికా చల్కే వైస్‌ కెప్టెన్లుగా ఉండనున్నారు.

భద్రాచలం, విశాఖ అమ్మాయిలకు చోటు

టి20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టులో భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష, హైదరాబాదీ కేసరి ధృతితో పాటు విశాఖపట్నం కుర్రది షబ్నమ్‌ లకు చోటు దక్కింది. అండర్‌-19 ఆసియాకప్‌ క్రికెట్‌ లో త్రిష హాఫ్ సెంచరీ చేసేసింది.

ఇదీ జట్టు..

నిక్కీ ప్రసాద్‌ (కెప్టెన్‌), సానికా చల్కే (వైస్‌ కెప్టెన్‌), గొంగడి త్రిష, కమిలిని (వికెట్‌ కీపర్‌), భవికా అహిరె (వికెట్‌ కీపర్‌), ఈశ్వరి అవసరె, మిథిలా వినోద్‌, జోషితా వీజే, సోనమ్‌ యాదవ్‌, పర్ణికా సిసోదియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, ఆనందితా కిశోర్‌, షబ్నమ్‌, వైష్ణవి ఎస్‌.

స్టాండ్‌బై లు : నందన ఎస్‌, ఐరా జే, అనధి టి

Tags:    

Similar News