అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ టికెట్ 15.. టీ కంటే తక్కువ రేటు.. ఎక్కడంటే?

అంతేకాక మన పొరుగునే జరుగుతుండడం ఇంకో ఆశ్చర్యకర నిజం.

Update: 2024-08-13 12:30 GMT

సహజంగా ఇప్పుడు మార్కెట్లో టీ ధర రూ.15 వరకు ఉంది.. ఇంకాస్త మంచి టీ అయితే రూ.20 ఆ పైనే.. మరి.. ఇంతకంటే తక్కువ రేటుకే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ టికెట్ రేటును నిర్ణయిస్తే.. అది కూడా ఓ పెద్ద జట్టు మరో అప్ కమింగ్ జట్టు మధ్య మ్యాచ్ అయితే..? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..? అయినా ఇది నిజం. అంతేకాక మన పొరుగునే జరుగుతుండడం ఇంకో ఆశ్చర్యకర నిజం.

స్వదేశంలో ఉద్రికత్తల నడుమ

బంగ్లాదేశ్ లో గత వారం ఏం జరిగిందో అందరూ చూశారు. తీవ్ర స్థాయి నిరసనల మధ్య ఆ దేశ ప్రధాన షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చేశారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రెండు టెస్టుల సిరీస్ కోసం పాకిస్థాన్ లో పర్యటించాల్సి ఉంది. కానీ, స్వదేశంలో పరిస్థితుల రీత్యా కనీసం ప్రాక్టీస్ సెషన్ కూడా లేకుండానే పాకిస్థాన్ కు వెళ్తోంది. బంగ్లా జాతీయ జట్టే కాదు.. బంగ్లా ఎ టీమ్ పరిస్థితి కూడా ఇంతే. ఇక అక్టోబరులో బంగ్లాదేశ్ లో మహిళల టి20 ప్రపంచ కప్ నిర్వహణ అనుమానంలో పడింది.

జోగి జోగి రాసుకుంటే..

ఇక పాకిస్థాన్ లో భద్రతా పరిస్థితుల రీత్యా ఏ దేశమూ అక్కడ క్రికెట్ ఆడేందుకు 15 ఏళ్లుగా ఏ దేశమూ అంత తొందరగా మొగ్గుచూపడం లేదు. రెండు, మూడేళ్లుగా మాత్రం ఒక్కో జట్టు వస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ కూడా పర్యటన చేయనుంది. కాగా.. పరిస్థితి చూస్తంటే జోగి జోగి రాసుకుంటూ బూడిద రాలినట్లుగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ భారత ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు పోటీగా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్)ను నడుపుతోంది. మన లీగ్ తో పోలిస్తే అది అతి సాధారణమే.

టికెట్ కొనేవారే లేరంట..

టి20 ఫార్మాట్ లో జరిగే పీఎస్ఎల్ కు టికెట్లు కొనేవారే లేరంట. స్టేడియానికి వచ్చి మ్యాచ్ లు చూసేందుకు పాక్ క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇటీవలి పీఎస్ఎల్ కు ఇదే పరిస్థితి ఎదురైందట. ఇక త్వరలో జరగాల్సిన పాక్ బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ కు టికెట్ల విక్రయం చేపట్టినా ఇదే పరిస్థితి అని భావించిందేమో? ఏకంగా రేట్లను తగ్గించేసింది. ఆ రేట్లు ఎంత అంటే.. కరాచీ టెస్టుకు ఒక రోజు టికెట్ 15 రూపాయిలేనట. ఈ నెల 30 నుంచి కరాచీలో పాక్-బంగ్లా మధ్యన రెండో టెస్టు జరగనుంది. టెస్టుకు ఆదరణ ఉండదని భావించిందేమో? అయితే, ఇంత తక్కువ రేటుకు టికెట్ అమ్మడం గత పదేళ్లలో ఇదే తొలిసారి అట. మరి దీనికైనా అభిమానులు వస్తారో రారో చూడాలి.

కొసమెరుపు: పాకిస్థాన్ లో కరాచీ పెద్ద నగరం. చారిత్రక ప్రాధాన్యం ఉన్నది. అలాంటి కరాచీలోనే మ్యాచ్ కు అభిమానులు రావడం లేదంటే పాకిస్థాన్ లో క్రికెట్ పరిస్థితి ఏమిటనేది తెలుస్తోంది. కనీసం స్కూల్, కాలేజీ పిల్లలను అనుమతించినా స్టేడియం కళగా కనిపిస్తుంది. ఆ పరిస్థితి కూడా లేనట్లుంది అక్కడ.

Tags:    

Similar News