పాక్ క్రికెట్ లో పీక్ కు బంధుప్రీతి.. ఈ క్రికెటరే నిదర్శనం..

మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ మేనల్లుడు ఇమాముల్ హక్ గతంలో జాతీయ జట్టులోకి ఎంపికైనప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి.

Update: 2024-05-31 12:35 GMT

అతడి 100 కిలోల వరకు బరువు ఉంటాడు.. వికెట్ల వెనుక చురుగ్గా కదల్లేడు.. అసలు వికెట్ల మధ్యన మామూలుగానే పరుగెత్తలేడు.. క్యాచ్ లు మిస్.. బ్యాటింగ్ లో డకౌట్.. అయినా టి20 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడు.. సరే.. ఆకారం ఎలా ఉన్నా, కనీసం ప్రతిభ ఉందని నిరూపించుకోవాలి కదా..? తన ఎంపికకు న్యాయం చేయాలి కదా..? ఇదేమీ జరగకపోవడంతో అతడి ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అత్యుత్తమ క్రికెటర్ ను కాదని..

పాకిస్థాన్ అంటేనే రాజకీయాల్లో సైన్యం పెత్తనం. క్రికెట్ లో అయితే బంధు ప్రీతి. మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ మేనల్లుడు ఇమాముల్ హక్ గతంలో జాతీయ జట్టులోకి ఎంపికైనప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, అతడు కొంత నయం. తన సత్తా నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరొక క్రికెటర్ మాత్రం పూర్తి బంధుప్రీతి (నెపోటిజం)కి నిదర్శనం అనేలా కనిపిస్తున్నాడు. అతడే వికెట్ కీపర్ బ్యాటర్ అజామ్ ఖాన్. వికెట్ కీపర్ గానే కాక పాక్ అత్యుత్తమ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్. అతడిని పక్కనపెట్టి మరీ అజామ్ కు చాన్సివ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పాక్ అభిమానులైతే అతడిపై విరుచుకుపడుతున్నారు.

5 బంతులు డకౌట్.. రెండు క్యాచ్ లు మిస్

ఆదివారం నుంచి టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. దీనికిముందు ఇంగ్లండ్ తో టి20 సిరీస్ ఆడుతోంది పాకిస్థాన్. నాలుగో టి20లో అజామ్ ఖాన్ ఐదు బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు. కీపింగ్‌ లోనూ ఘోర ప్రదర్శన కనబరిచాడు. బంతిని పట్టుకునేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో ఇతడిని ప్రపంచ కప్ కోసం ఎంపిక చేశారా? అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

నాన్న పేరు చెడగొట్టేలా..

అజామ్ ఖాన్ తండ్రి మోయిన్ ఖాన్. ఇతడు పాకిస్థాన్ ఆల్ టైమ్ బెస్ట్ వికెట్ కీపర్ లలో ఒకడు. అందుకనే అజామ్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేశారనే విమర్శలు వస్తున్నాయి. మా దేశంలో భయంకర బంధు ప్రీతికి అజామ్ ఖాన్ ఒక ఉదాహరణ.. ఎక్కడా పారదర్శకత లేదు. ఇలాంటివాళ్లను సెలక్ట్ చేసినవారు సిగ్గుపడాలి. ఇది పొరపాటు కాదు. క్రిమినల్ చర్యలు తీసుకుని జైలుకు పంపాలి అంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. ‘‘అసలు అతడికి అంతర్జాతీయ స్థాయి ఫిట్ నెస్ ఉందా? ద్వైపాక్షిక సిరీస్ లోనే ఇలా ఆడితే ప్రపంచ కప్‌ లో ఏం రాణిస్తాడు?’’ అని మరొకరు మండిపడ్డారు. ‘‘ఆ ఫిట్ నెస్ చూడండి.. ఏదో బలవంతంగా జట్టులోకి ఎంపిక చేశారు. ఎలా ఎంపిక చేశారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న?’’ అని ఇంకో అభిమాని నిప్పులు చెరిగాడు. కాగా అజామ్ ఖాన్ బ్యాటింగ్, కీపింగ్ వైఫల్యానికి సంబంధించిన క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Tags:    

Similar News