రూ.23 కోట్లు.. 23 పరుగులైనా చేయలే.. క్రికెటర్ పై ఫ్యాన్స్ ట్రోలింగ్
ఈ సీజన్ లో కేకేఆర్ కు వైస్ కెప్టెన్ అయిన వెంకటేశ్ అయ్యర్ మూడు మ్యాచ్ లలో చేసింది 15 పరుగులే.;

‘ధరకు తగ్గ న్యాయం’.. ఇదీ తెలుగులో చెప్పుకొనే మాట.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దీనికి కాస్త మార్చి చెప్పుకొంటే.. ‘రేటుకు సరిపడా రన్స్’ అనుకోవాలి. ఓ జట్టు చాంపియన్ గా నిలవడంలో గత ఏడాది కీలక పాత్ర పోషించి.. ఓ దశలో కెప్టెన్ గానూ పేరు వినిపించిన.. ఇప్పుడు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆల్ రౌండర్ గురించి ఇదంతా.
కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్).. ఐపీఎల్18లో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టిన ఈ జట్టు సోమవారం జరిగిన మ్యాచ్ లో కేవలం 116 పరుగులకే ఆలౌటైంది. రమణ్ దీప్ సింగ్ లాంటి హిట్టర్ 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా అత్యంత పేలవంగా ఆడింది. మిగతా జట్టు కంటే వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ తీరే విమర్శలకు తావిస్తోంది.
ఈ సీజన్ లో కేకేఆర్ కు వైస్ కెప్టెన్ అయిన వెంకటేశ్ అయ్యర్ మూడు మ్యాచ్ లలో చేసింది 15 పరుగులే. మెగా వేలానికి ముందు అతడిని కోల్ కతా రూ.23.75 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇప్పుడు ఆ ధరను, వెంకటేశ్ అయ్యర్ చేసిన పరుగులను పోల్చుతూ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
గత సీజన్ లో కేకేఆర్ ను చాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఎక్కువ డిమాండ్ చేయడంతో కోల్ కతా ఫ్రాంచైజీ అతడిని వదిలేసుకుంది. దీంతో ఓ దశలో వెంకటేశ్ అయ్యర్ పేరు కెప్టెన్ గా వినిపించింది. మరి ఏమనుకున్నారో ఏమో కానీ, రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో తీసుకున్న అజింక్య రహానేకు కెప్టెన్సీ ఇచ్చారు.
ముంబైతో మ్యాచ్ లో వెంకటేశ్ అయ్యర్ 9 బంతులాడి 3 పరుగులే చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడ్డాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్ లో 6 పరుగులకు ఔటయ్యాడు. ఇప్పుడు అతడి రేటును ఆటను పోలుస్తూ అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక ఆటగాడిని హీరోను చేయాలన్నా, విలన్ ను చేయాలన్నా అభిమానులే అన్నట్లుంది పరిస్థితి. గత సీజన్ లో అయ్యర్ మంచి ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ ను గెలిపించాడు. ఇప్పుడు మాత్రం అతడిలో ఆ జోష్ కనిపించడం లేదు. దీంతో అభిమానులు ఓ ఆటాడుకుంటున్నారు. పైగా వెంకటేష్ కు ఈ మధ్య అడ్వర్టయిజ్ మెంట్లు కూడా వస్తున్నాయి. వాటితో కలిపి అతడి ఆటను పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు.
పైగా ఈ సీజన్ లో వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్ కు కూడా దిగడం లేదు. పూర్తి బ్యాట్స్ మన్ గా అతడు తన ధరకు న్యాయం చేయలేకపోతున్నాడు.