హెయిర్ కట్ కు బదులు.. గుండు చేయించుకొని ఉంటేనా?

నోటి వరకు వచ్చిన ముద్దు చేజారితే ఎలా ఉంటుంది. ఒక ముద్ద కాకుంటే మరో ముద్ద నోటికి అందుతుంది.

Update: 2024-08-08 05:25 GMT

నోటి వరకు వచ్చిన ముద్దు చేజారితే ఎలా ఉంటుంది. ఒక ముద్ద కాకుంటే మరో ముద్ద నోటికి అందుతుంది. కానీ.. నాలుగేళ్లకు ఒకసారి ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ లాంటి టోర్నీలో బంగారు పతకానికి దగ్గరగా వచ్చి.. ఒకవేళ తేడా కొడితే రజతం ఖాయమన్నట్లుగా ఉన్న పరిస్థితి నుంచి.. అనర్హత వేటు పడటానికి మించిన దారుణ నిరాశ ఇంకేం ఉంటుంది. తాజాగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పరిస్థితి ఇలానే ఉంది. ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై అర్హత వేటు పడింది.

దీంతో.. 140 కోట్ల భారతీయుల గుండె పగిలింది. వారి వేదన అంతా ఇంతా కాదు. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు.. అందరూ వినేశ్ ను ఓదార్చే పనిలో పడ్డారు. ఎంతమంది ఎంతలా ఓదార్చినా.. ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెజ్లింగ్ లాంటి క్రీడలో వారు పోటీ బరిలో ఉండే బరువుకు సంబంధించి చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. చిన్న తేడా వచ్చినా జరిగే డ్యామేజ్ ఇలానే ఉంటుంది.

అలాంటప్పుడు బరువు విషయంలో వినేశ్ కేర్ టేకర్స్ ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్న వస్తుంది. ఆమె బరువును తగ్గించేందుకు రాత్రంతా టీం మొత్తం మేల్కొని ఉందని.. కఠినమైన వర్కువుట్లు చేయటం ద్వారా బరువు తగ్గేందుకు శ్రమించినట్లుగా చెబుతున్నారు. అప్పటికి ఉండాల్సిన బరువు కంటే కాస్త ఎక్కువగా ఉండటంతో.. ఆమె జుట్టును కత్తించారు. అయినప్పటికీ.. పోటీలో పాల్గొన్నవేళకు ఆమె ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు ఉండటంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.

ఇలాంటి వేళ.. జుట్టు కత్తిరించి వదిలేసే బదులు.. గుండు కొట్టించి ఉంటే కచ్ఛితంగా వంద గ్రాములు తగ్గి బ్యాలెన్సు అయ్యేదంటున్నారు. జట్టు కత్తిరించే వరకు వెళ్లిన వారు.. గుండు కొట్టిస్తే మొత్తానికే మేలు జరుగుతుందన్న చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారన్న వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. అయితే.. ఇలా గుండు విషయంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అన్న దానిపై క్లారిటీ లేదు. ఏమైనా.. కత్తిరించుకున్న జుట్టుకు భిన్నంగా గుండుతో బరిలోకి దిగి ఉంటే.. సీన్ మరోలా ఉండేదని.. భారతీయులంతా ఫుల్ హ్యాపీగా ఉండేవారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News