తండ్రి చనిపోయినా.. తట్టుకుని క్రికెట్ ఆడిన కోహ్లికి గుండెకు ఏమైంది?
2006 డిసెంబరులో విరాట్ కోహ్లికి ఎదురైన అనుభవం ఇది. నాడు కర్ణాటకతో రంజీ మ్యాచ్ లో కోహ్లి 90 పరుగులు చేసి ఢిల్లీని ఫాలో ఆన్ నుంచి గట్టెక్కించాడు.;

కేవలం 17 ఏళ్ల వయసు.. నూనూగు మీసాలు.. అప్పటివరకు తండ్రి స్కూటర్ వెనుక కూర్చుని క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లిన అనుభవం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. అంతా నాన్నే.. అలాంటి నాన్న.. తాను గొప్ప క్రికెటర్ ను కావాలని కలలు కన్న నాన్న.. ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడుతుండగా చనిపోయాడని తెలిసింది ఆ కుర్రాడికి..
ఒకవైపు జట్టు పరిస్థితి చూస్తే కష్టాలలో ఉంది. . అతడు ఆడకుంటే ఓటమి ఖాయం.. మరోవైపు ఇంటి దగ్గర తండ్రి శవం.. అంతటి కష్టంలోనూ గుండె దిటవు చేసుకుని జట్టు కోసం ఆడాడు..
2006 డిసెంబరులో విరాట్ కోహ్లికి ఎదురైన అనుభవం ఇది. నాడు కర్ణాటకతో రంజీ మ్యాచ్ లో కోహ్లి 90 పరుగులు చేసి ఢిల్లీని ఫాలో ఆన్ నుంచి గట్టెక్కించాడు. ఆ తర్వాతి రోజు ఇంటికి వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే కోహ్లి మానసిక స్థైర్యం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు. అతడి గుండె ధైర్యం గురించి చెప్పేందుకు. ఆ తర్వాత 2013లో వైఫల్యాలు ఎదురైనప్పుడు కోహ్లి తనను తాను తీర్చిదిద్దుకుని ఒక శిల్పంగా మారిన సంగతి తెలిసిందే.
కాగా, కోహ్లి ఇప్పుడు తిరుగులేని సూపర్ స్టార్. అయితే, ఆదావరం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో కోహ్లి చేసిన ఓ పని చూసి అభిమానుల గుండెలు ఆగినంత పనైంది.
ఈ మ్యాచ్ లో కోహ్లి హాఫ్ సెంచరీ చేసి తన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును గెలిపించిన సంగతి తెలిసిందే. జట్టు విజయానికి దగ్గరగా ఉన్నప్పుడు రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ దగ్గరకు వచ్చిన కోహ్లి.. తన గుండె స్పందన ఎలా ఉందో చూడాలని కోరాడు.
15వ ఓవర్లో హసరంగ బౌలింగ్ లో సిక్స్ కొట్ హాఫ్ సెంచరీని చేరుకున్న కోహ్లి.. తర్వాతి బంతికి పడిక్కల్ తో కలిసి వేగంగా రెండు పరుగులు తీశాడు. దీంతో కాసింత ఇబ్బందిగా కనిపించాడు. ఏదో తేడాగా ఉందని భావించాడేమో..? సంజూ దగ్గరకు వెళ్లి గుండె స్పందన చూడమని కోరాడు. చివరకు అంతా బాగానే ఉందని సంజూ చెప్పడంతో బ్యాటింగ్ కొనసాగించాడు.