టీమిండియా స్టార్ బ్యాటర్ కు అసలైన 'టెస్టు'.. గట్టెక్కకుంటే కష్టమే

ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ వంటి జట్టుతో రెండు టెస్టుల సిరీస్ అతడికి నిజంగా టెస్టు అనడంలో సందేహం లేదు.

Update: 2024-09-18 19:30 GMT

ఓవైపు కుర్రాళ్లు దూసుకొస్తున్నారు.. మరోవైపు అతడి ఫామ్ కాస్త సడలుతోంది.. వయసు పైబడుతోంది.. ఇటీవలి పెర్ఫార్మెన్స్ అప్ అండ్ డౌన్ అవుతోంది.. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు.. వన్డేలు ఎంత కాలం ఆడతాడో తెలియదు.. శ్రీలంకతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో స్పిన్ ను ఎదుర్కొనడంలో విఫలమయ్యాడు.. ఇక మిగిలింది టెస్టులే.. అందులోనూ రాణించకుంటే ముప్పు తప్పదు. ఇదీ ప్రస్తుతం టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ పరిస్థితి. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ వంటి జట్టుతో రెండు టెస్టుల సిరీస్ అతడికి నిజంగా టెస్టు అనడంలో సందేహం లేదు.

జట్టుకు 6 నెలలు.. అతడికి 9 నెలలు

టీమ్ ఇండియా టెస్టు మ్యాచ్ ఆడి 6 నెలలు దాటుతుంటే.. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి టెస్టు ఆడి 9 నెలలు అవుతోంది. ఓ అంతర్జాతీయ క్రికెటర్ కు ఇది సుదీర్ఘ విరామమే. అందులోనూ విరాట్ కోహ్లి అత్యంత ఇష్టపడే ఫార్మాట్ ఇది. ఇది కోహ్లి కావాలని విరామం తీసుకోవడంతోనే జరిగింది. భార్య అనూష్క శర్మ రెండో బిడ్డకు జన్మనిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అంతకుముందు జనవరిలో దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ఆడాడు. మళ్లీ గురువారం నుంచి బంగ్లాదేశ్ తో టెస్టు బరిలో దిగుతున్నాడు.

టెస్టులే టెస్టులు..

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాతో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ మొదలు టీమ్ ఇండియా వరుసగా 10 టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో బంగ్లాతో రెండు, న్యూజిలాండ్ తో మూడు (స్వదేశంలో), ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్ లు ఉన్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్ షిప్ లో టాప్ (68.5 శాతం)లో ఉంది. ఇప్పటికైతే ఫైనల్ చేరే చాన్సుంది. అంతమాత్రాన మిగతా మ్యాచ్ లను నిర్లక్ష్యం చేస్తే ఫైనల్ ఆడే చాన్స్ చేజారుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ లలో కోహ్లి రాణించడం కీలకం. మరోవైపు కోహ్లి ఫామ్ గొప్పగా ఏమీలేదు. టి20 ప్రపంచ కప్ లో ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ (76) తప్ప మిగతా మ్యాచ్ లలో విఫలమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ కు దూరంగా ఉందామని భావిస్తే హెడ్ కోచ్ గంభీర్ పట్టుపట్టడంతో పాల్గొన్నాడు. కానీ, 24, 14, 20 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో వచ్చే 10 టెస్టుల్లో కోహ్లి రాణించడం టీమ్ ఇండియాకు చాలా కీలకం. అతడికి అంతకంటే కీలకం.

ముప్పు లేకున్నా.. మున్ముందు కష్టమే

జట్టులో కోహ్లి స్థానానికి ఇప్పటికైతే వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ.. మున్ముందు వరుసగా విఫలమైతే కష్టమే. కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో సర్ఫరాజ్ ఖాన్ వంటి కుర్రాళ్లను పక్కనపెడుతున్నారు. రంజీల్లో అదరగొడుతున్న ఎందరో ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి జాగ్రత్త పడాల్సిందే. కాగా, గురువారం నుంచి బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక. ఇందులో అతడు 4 టెస్ట్‌ మ్యాచ్‌ లు ఆడి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సహా 267 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ తో ఆరు టెస్ట్‌ లు ఆడిన కోహ్లీ ఒక సెంచరీ, ఒక డబుల్‌ సెంచరీతో 437 పరుగులు సాధించాడు. మరిప్పుడు ఏం చేస్తాడో?

Tags:    

Similar News