అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్.. ఒకే కారణంతో జట్టుకు దూరం

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరడం టీమ్ ఇండియాకు పెద్ద కష్టమేం కాదు కానీ.. పరిస్థితులు అన్నీ ఇలానే ఉంటాయని ఏమీ లేదు కదా.

Update: 2024-10-13 21:30 GMT

నాలుగు నెలల కిందట జరిగిన టి20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ వేటలో ఉంది. గత రెండుసార్లు వరుసగా ఫైనల్స్ కు వెళ్లిన మన జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఈసారి ఎలాగైనా చాంపియన్ షిప్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆ క్రమంలో ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. 11 మ్యాచ్ లు ఆడి 8 గెలిచి 2 ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తం 98 పాయింట్లు 74.24 శాతం విజయాలతో అందరి కంటే ముందుంది. తర్వాతి స్థానంలోని ఆస్ట్రేలియా 12 మ్యాచ్ లలో 8 విజయాలు, మూడు ఓటములు, 1 డ్రాతో 90 పాయింట్లు, 62.50 శాతం విజయాలతో ఉంది.

ఫైనల్స్ చేరడం ఖాయమే కానీ..

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరడం టీమ్ ఇండియాకు పెద్ద కష్టమేం కాదు కానీ.. పరిస్థితులు అన్నీ ఇలానే ఉంటాయని ఏమీ లేదు కదా. ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. దీనిని క్లీన్ స్వీప్ చేయాలి. కివీస్ అంత తేలిగ్గా తలగ్గొద్దు. ఇక ఆ వెంటనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. 32 ఏళ్ల తర్వాత ఆసీస్ తో ఐదు మ్యాచ్ ల సుదీర్ఘ టెస్టు సిరీస్ జరగనుంది. గత రెండు సిరీస్ లను భారత్ కు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఈసారి మాత్రం కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంది. మొత్తమ్మీద ఆ 8 టెస్టుల్లో భారత్ నాలుగు లేదా ఐదు గెలవాలి. అప్పుడే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరడం ఖాయం అవుతుంది. అయితే, కివీస్ పై మూడుకు మూడు గెలిచినా ఆస్ట్రేలియాలో ఒకటి, రెండు విజయాలు సాధించాలి.

రోహిత్ దూరం.. ఒక మ్యాచ్ కా? రెండింటికా?

టి20లకు గుడ్ బై చెప్పి టెస్టు, వన్డేలకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్ లో భారత్ ను నడిపించాల్సి ఉంది. నవంబరులో ఈ సిరీస్ మొదలుకానుంది. అయితే, రోహిత్ సిరీస్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడని కథనాలు వస్తున్నాయి. తొలి మ్యాచ్ లో అతడు పాల్గొనడని చెబుతున్నారు. రెండో టెస్టుకూ అందుబాటులో ఉండడం కష్టమే అంటున్నారు. దీంతోనే స్టార్ పేసర్ బుమ్రాను న్యూజిలాండ్ తో సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. వాస్తవానికి స్వదేశంలో సిరీస్ లకు వైస్ కెప్టెన్ల ప్రకటన ఉండదు. అయితే, ఆస్ట్రేలియాతో ప్రారంభ టెస్టులకు రోహిత్ దూరంగా ఉంటున్నందున.. కెప్టెన్సీపై అవగాహన కోసం బుమ్రాను వైస్ కెప్టెన్ ను చేశారు.

కారణం ఇదే

రోహిత్ జట్టుకు దూరంగా ఉండడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. కానీ, వ్యక్తిగత కారణాలతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ భార్య రితిక ప్రస్తుతం గర్భంతో ఉందని.. నవంబరులో డెలివరీ కానుందని సమాచారం. ఆ సమయంలో భార్య దగ్గర ఉండేందుకే రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడట. ఇక భార్య డెలివరీ తర్వాత రోహిత్ ఆస్ట్రేలియా ప్రయాణం అవుతాడని చెబుతున్నారు. రోహిత్-రితికాలది ప్రేమ వివాహం. వీరికి ఇప్పటికే ఒక పాప ఉంది. కాగా, 2020 నాటి ఆస్ట్రేలియా టూర్ లోనూ కోహ్లి ఇలానే మొదటి మ్యాచ్ ఆడి స్వదేశం వచ్చేశాడు. నాడు కోహ్లి భార్య, నటి అనుష్క శర్మ తొలి సంతానానికి జన్మనిచ్చింది. తొలిసారి తండ్రి కాబోతున్న ఆనందాన్ని ఆస్వాదించేందుకు కోహ్లి జట్టును వీడాడు. ఈ ఏడాది ప్రారంభంలో అనుష్క రెండో సంతానానికి జన్మనివ్వబోతున్న సమయంలోనూ ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్నాడు కోహ్లి. ఇప్పుడు రోహిత్ కూడా ఆస్ట్రేలియాతో సిరీస్ తొలి మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు.

Tags:    

Similar News