ఆడుతూనే అనంత లోకాలకు.. మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్
గుండెపోటు.. ఇటీవలి కాలంలో యువకులనూ వదలడం లేదు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు.
గుండెపోటు.. ఇటీవలి కాలంలో యువకులనూ వదలడం లేదు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. కొన్ని సంఘటనల్లో పిల్లలూ ప్రాణాలు కోల్పోతున్నారంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇలాంటివి రోజుకో ఉదాహరణ అయినా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఓ కుర్రాడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. మైదానంలోనే తుది శ్వాస విడిచాడు. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుండడంతో చూసినవారు.. ఘటనను ప్రత్యక్షంగా చూసిన అతడి సహచరులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు.
ఇంతకూ ఏం జరిగిందంటే..
స్పోర్ట్స్ చానెళ్లు అంతగా అందుబాటులో లేవు కాబట్టి గతంలో అంతర్జాతీయ మ్యాచ్ లకే లైవ్ తక్కువ. కానీ, ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. దీంతో ఎక్కడ మ్యాచ్ లు జరిగినా లైవ్ స్ట్రీమ్ ఇచ్చేస్తున్నారు. ఆఖరికి పిల్లల మ్యాచ్ లు కూడా లైవ్ ఇస్తున్నారు. వివిధ కార్పొరేట్ సంస్థలు తమ సిబ్బందికి నిర్వహించే మ్యాచ్ లూ లైవ్ స్ట్రీమ్ అవుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. కాగా, మహారాష్ట్రలోని పుణెలో ఇలానే ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. అందులో 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ మైదానంలోనే ప్రాణాలు వదిలాడు. మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన అతడు కొద్దిసేపటి తర్వాత ఎడమవైపు చాతీలో నొప్పి అంటూ సహచరులకు చెప్పాడు. ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడి డగౌట్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ, కొద్ది దూరం నడిచాక కుప్పకూలాడు. దీన్నంతటినీ మైదానంలో చూస్తున్నవారు హడలెత్తిపోయారు. లైవ్ స్ట్రీమింగ్ లో చూసినవారు మరీ ఆందోళన చెందారు. ఈ మేరకు వీడియోలు సోషల్ మీడియాలోకీ వచ్చాయి. కాగా, ఇమ్రాన్ ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.
శారీరకంగా బలంగా ఉన్నా..
ఇమ్రాన్ వయసు 35. శారీరకంగా అతడు బలంగా ఉన్నాడు. ఫిట్ గానూ కనిపిస్తున్నాడు. కానీ, అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో సహచరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రౌండర్ గా ఇమ్రాన్ ప్రతి మ్యాచ్ లోనూ ఉత్సాహంగా ఉంటాడని పేర్కొన్నారు. అంతేకాదు.. అతడికి గతంలో ఎప్పుడూ అనారోగ్యం, అస్వస్థతల వంటివి లేవన్నారు.
నాలుగు నెలల కుమారుడు..
ఇమ్రాన్ పటేల్ కు భార్య, ముగ్గురు కుమార్తెలు, నాలుగు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. క్రికెట్ ఆడడమే కాక రియల్ ఎస్టేట్, జ్యూస్ షాప్ నడుపుతున్నాడు. కాగా, మహారాష్ట్రలోని పుణెలోనే రెండు నెలల కిందట హబీబ్ షేక్ క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. అతడికి మధుమేహం ఉంది. ఇమ్రాన్ పటేల్ కు మాత్రం అనారోగ్య సమస్యలేమీ లేవని తెలసింది.