ధనుష్ ఫ్యాన్స్ 10 రోజుల ఎదురుచూపులకు తెర

హీరోగా వరుస విజయాలతో దూసుకు పోతున్న ధనుష్ దర్శకుడిగానూ సినిమాలు చేస్తూ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.;

Update: 2025-04-01 09:57 GMT
ధనుష్ ఫ్యాన్స్ 10 రోజుల ఎదురుచూపులకు తెర

హీరోగా వరుస విజయాలతో దూసుకు పోతున్న ధనుష్ దర్శకుడిగానూ సినిమాలు చేస్తూ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గత ఏడాది తన దర్శకత్వంలో 'రాయన్‌' సినిమాను తీసుకు వచ్చిన ధనుష్ ఈ ఏడాది ఆరంభంలోనే 'నీలవుకు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబమ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ధనుష్ లవ్‌ స్టోరీని ఎలా డీల్‌ చేస్తాడో, యూత్‌ ఆడియన్స్‌ను ఎలాంటి కంటెంట్‌తో ఆకట్టుకుంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమాను జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్‌తో డబ్‌ చేసి రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ఆ సమయంలో బాక్సాఫీస్‌ వద్ద ఉన్న పోటీ కారణంగా వసూళ్లు కాస్త తక్కువ నమోదు అయ్యాయి. కానీ ఈ సినిమా అంతకు మించి వసూళ్లు రాబట్టే సత్తా ఉన్న సినిమా అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ధనుష్ అభిమానులు ఈ సినిమాను థియేట్రికల్‌ రిలీజ్‌ సమయంలో సాధ్యం అయినంత వరకు సక్సెస్ చేశారు. తమిళ్‌ ధనుష్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ధనుష్ ఫ్యాన్స్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేశారు. సాధారణంగా థియేట్రికల్‌ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది.

ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమాను తమిళ్‌ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు నాలుగు వారాల్లోనే తీసుకు వచ్చారు. కానీ తెలుగు వర్షన్ మాత్రం స్ట్రీమింగ్‌ కాలేదు. ధనుష్ అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ పది రోజులు ఆలస్యం అయింది. తమిళ్‌లో స్ట్రీమింగ్‌ మొదలైనప్పటి నుంచి తెలుగు ఓటీటీ ప్రేక్షకులు తెలుగు వర్షన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు తెలుగు ఓటీటీ ప్రేక్షకులు, తెలుగు ధనుష్ అభిమానుల ఎదురుచూపులకు తెర పడినట్లు అయింది. తమిళ్ వర్షన్‌ స్ట్రీమింగ్‌ అవుతున్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనే తెలుగు వర్షన్‌ ను సడెన్‌గా స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.

సాధారణంగా డబ్బింగ్‌ సినిమాలను, చిన్న సినిమాలను వేరు వేరుగా ఉంచకుండా భాష ఎంపిక చేసుకునే ఆప్షన్‌ ఇస్తారు. కానీ తమిళ్‌ సినిమాకు వేరుగా, తెలుగు సినిమాకు వేరుగా స్ట్రీమింగ్‌ చేశారు. వేరు వేరుగా జాబితాలో చేర్చడం ద్వారా ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు చూసే అవకాశాలు ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ధనుష్ దర్శకుడిగా మూడో సినిమాకే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కమ్‌ లవ్‌ స్టోరీ సినిమాను తీశాడు అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు దక్కించుకున్నాడు.

ఈ సినిమాతో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అనిఖా సురేంద్రన్‌, ప్రియా ప్రకాష్ వారియర్‌లు నటించారు. ఇంకా కీలక పాత్రల్లో మాథ్యూ థామస్‌, రమ్య రంగనాథన్‌ నటించారు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జాబిలమ్మ నీకు అంత కోపమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న నేపథ్యంలో ధనుష్ అభిమానులు ఎగబడి చూస్తున్నారు. ఈ వీకెండ్‌కు అత్యధికంగా వ్యూస్‌, ప్లే టైం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News